అంబటి రాంబాబుకు బెయిల్- ఆ పిటీషన్ డిస్మిస్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు భారీ ఊరట లభించింది. న్యాయస్థానంలో ఆయనకు బెయిల్ లభించింది. ఈ మేరకు గుంటూరు జిల్లా కోర్టు కొద్దిసేపటి కిందటే బెయిల్ మంజూరు చేసింది. అంబటి రాంబాబును తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను జిల్లా సెషన్స్ న్యాయస్థానం జడ్జి కొట్టివేశారు. దీన్ని తోసిపుచ్చారు. ఈ కేసులో కస్టడీ అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
అంబటి రాంబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తన సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలో అక్రమంగా లక్కీ డ్రా నిర్వహించారనే ఆరోపణలతో అంబటి రాంబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. 2023 సంక్రాంతి సంబరాల పేరుతో కోట్ల రూపాయలను వసూలు చేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఆయనపై కేసు నమోదైంది.

ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. విచారణను ఎదుర్కొంటోన్నారు. ఇటీవలే విచారణ నిమిత్తం గుంటూరు న్యాయస్థానానికి హాజరయ్యారు. ఆయన తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ పై విచారణ చేపట్టింది గుంటూరు కోర్టు. ఇరు పక్షాల వాదోపవాదాలను ఆలకించిన తర్వాత విచారణను నేటికి వాయిదా వేసింది. నేడు మళ్లీ బెయిల్ పిటీషన్ పై విచారణ జరిపింది.
లక్కీ డ్రా కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉందని, ఈ దశలో అంబటి రాంబాబుకు బెయిల్ ఇవ్వడం వల్ల తన పలుకుబడిని ఉపయోగించి దర్యాప్తును ప్రభావితం చేయవచ్చని పోలీసుల తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ వాదనలతో న్యాయమూర్తులు ఏకీభవించలేదు. ఈ కేసులో కస్టడీలోకి తీసుకుని విచారణ జరపాల్సిన అవసరం లేదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. కస్టడీకి ఇవ్వాలంటూ ఇచ్చిన పిటీషన్ ను కొట్టివేశారు. అంబటికి బెయిల్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications