ఇదే ఈ కథలో నీతి- సాయిరెడ్డితో అంబటి రాంబాబు భేటీ
అమరావతి: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం.. బ్రో. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ కింద టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మించారు. సముద్రఖని దర్శకుడు. ఈ సినిమా ఏపీలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారానికి కేంద్రబిందువు అయింది.
గతంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చేసిన డాన్స్‌ను ఇందులో పేరడీగా పెట్టడం వివాదానికి దారి తీసింది. బ్రో సినిమాలో ఓ సీన్‌లో మంత్రి అంబటి రాంబాబును అనుకరిస్తూ కమేడియన్ పృథ్వీ డాన్స్ చేయడం, ఆయనపై పవన్ కల్యాణ్ సెటైర్లు వేయడం కలకలం రేపుతోంది.

దీనిపై అంబటి రాంబాబు ఇప్పటికే తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సినిమాను సినిమాలాగే చూడాలంటూ విజ్ఞప్తి చేసిన బ్రో సినిమా హీరో సాయి ధరమ్ తేజ్‌పై విమర్శలు చేశారు. సినిమాలను సినిమాగానే తీయండి.. అప్పుడు సినిమాను సినిమాగా చూస్తారని ఎదురుదాడికి దిగారు. సినిమాల్లో రాజకీయ నాయకులను గోకడమెందుకు అంటూ నిలదీశారు.
తనను గోకితే.. దాని ఫలితం ఇలాగే ఉంటుందని అంబటి రాంబాబు అన్నారు. తన మీద వెబ్ సిరీస్ తీసుకున్నా.. అభ్యంతరం లేదని, అందులో సాయిధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్‌ను హీరోలుగా పెట్టి.. విశ్వప్రసాద్‌తో దాన్ని తీయించినా పెద్దగా పట్టించుకోనని వ్యాఖ్యానించారు. అసలు పవన్ కల్యాణ్ సినిమాల గురించి తాను ఎప్పుడూ పట్టించుకోలేదని గుర్తు చేశారు.
సినిమాలను సినిమాగా తీస్తే ఎవరికీ, ఎలాంటి అభ్యంతరం ఉండదని, తనను గోకితే రియాక్షన్ ఇలాగే ఉంటుందని, ఈ కథలో నీతి ఇదేననీ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. బ్రో వెనుక పెద్ద వ్యవహారమే ఉందని అనుమానాలను వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌ను తాను ఇచ్చే ప్యాకేజీని చంద్రబాబు.. విశ్వప్రసాద్ ద్వారా పంపించాడని ఆరోపించారు.












Click it and Unblock the Notifications