అర్నబ్ తుఫాన్‌పై కేంద్రమంత్రి అమిత్ షా సమీక్ష.. ఆ రాష్ట్రాలకు భరోసా.. ఏమన్నారంటే!
అర్నబ్ తుఫాన్ ప్రభావం ఏపీ, తెలంగాణా, ఒడిశా,చత్తీస్ గడ్ తో పాటు అనేక రాష్ట్రాల మీద దారుణంగా ఉంది. దీంతో అర్నబ్ తుఫాను ప్రభావంపై కేంద్రం సమగ్ర సమీక్ష నిర్వహించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి పరిస్థితులపై సమీక్షించారు. తుఫాన్ బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన సహాయ, పునరావాస చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.
నష్ట తీవ్రతను అంచనా వేసేందుకు త్వరలోనే కేంద్ర బృందాలు బాధిత రాష్ట్రాలకు వస్తాయని హామీ ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే అమిత్ షాకు లేఖ రాశారు. ఫోన్లో కూడా మాట్లాడి తుఫాన్ వల్ల రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని వివరించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 70,900 హెక్టార్లలో వ్యవసాయ పంటలు నీట మునిగాయి. 10,450 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.

కోనసీమ, విశాఖపట్నం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. 180 ఇళ్లు దెబ్బతినగా, రహదారులపై చెట్లు కూలి విద్యుత్ స్తంభాలు పాడైనట్లు వివరించారు. ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని చెప్పి, నష్టం అంచనాకు కేంద్ర బృందాలను త్వరితగతిన పంపాలని కోరారు.తుఫాన్ సమయంలో 28 వేలకు పైగా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
16 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు 14 జిల్లాల్లో మోహరించి సహాయక చర్యలు చేపట్టాయి. విద్యుత్, నీటి సరఫరా పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. ఒడిశాలో కూడా భారీ వర్షాలు కురిశాయి కానీ ప్రాణనష్టం లేకుండా నిర్వహించగలిగారు. 43 వేల మందికి పైగా ప్రజలను షెల్టర్లకు తరలించారు. కేంద్రం ప్రకృతి విపత్తు వేళ బాధితులకు అండగా ఉంటుందని అమిత్ షా స్పష్టం చేశారు.
ఇంటర్-మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్స్ త్వరలో నష్టం అంచనా వేసి అవసరమైన సహాయం అందించేందుకు రాష్ట్రాలకు వస్తాయి. తుఫాన్ ప్రభావం తగ్గినా కొన్ని ప్రాంతాల్లో ఇంకా వర్షాలు కొనసాగుతున్నాయి. పంట నష్టం, మౌలిక వసతుల పునరుద్ధరణ, పారిశుద్ధ్యం, తాగునీటి భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే బాధితులకు త్వరితగతిన ఉపశమనం లభిస్తుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి చర్యలు చేపట్టడం వల్ల ప్రాణనష్టం నివారించగలిగారు. ఇప్పుడు నష్టపరిహారం, పునరావాసం, పంటల పరిహారంపై దృష్టి సారించాల్సి ఉంది. అమిత్ షా సమీక్షతో బాధిత రాష్ట్రాలకు కేంద్ర సహకారం మరింత బలపడుతుందని అంచనా వేస్తున్నారు .












Click it and Unblock the Notifications
