'2019 నాటికి అధికారం లక్ష్యం, నాలుగు నెలలకోసారి తెలంగాణకు షా'
హైదరాబాద్: 2019 నాటికి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూసుకు వెళ్తామని, నాలుగు నెలలకు ఓసారి తమ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని, ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరిలో వస్తారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు.
ఆయన ఆదివారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా చేపడతామన్నారు. 2019 నాటికి బీజేపీని బలమైన శక్తిగా మారుస్తామని చెప్పారు.
శనివారం హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. రాష్ట్రంలో 2019లో అధికారమే లక్ష్యంగా ప్రతి నాలుగు నెలలకు ఓసారి పర్యటించాలని అమిత్ షా నిర్ణయించారని, ఇందులో భాగంగా డిసెంబరులో వస్తారని కిషన్ రెడ్డి చెప్పారు. దేశవ్యాప్తంగా పదికోట్ల మందికి సభ్యత్వాన్ని అందించి ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టిగా బీజేపీ అవతరించనుందని చెప్పారు.

తెలంగాణలో 20 లక్షల సభ్యత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నామని, సభ్యత్వ నమోదుని పర్యవేక్షించేందుకు అమిత్ షా రాష్ట్రానికి రానున్నారని చెప్పారు. హైదరాబాదులో లేదా వరంగల్‌లో సమావేశం ఉంటుందన్నారు. 5 లక్షల మంది పార్టీ కార్యకర్తలతో ఫిబ్రవరిలో పరేడ్ మైదానంలో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. దీనికి మోడీ హాజరవుతారన్నారు.
జీహెచ్ఎంసీలో అధికారంలో ఉన్న మజ్లిస్ పార్టీ దోపిడీ చేసిందని, రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలన్నారు. మహిళా కార్పోరేటర్లు హాజరయ్యే కార్యక్రమాల్లో వారి భర్తలకూ కుర్చీలు వేయాల్సిన సంస్కృతి పోవాలన్నారు. వందమందికి సభ్యత్వం కల్పించి, వారం రోజులపాటు సభ్యత్వ నమోదులో పని చేసిన వారికే ఈసారి పదవులు ఇవ్వాలనే నిబంధన రూపొందించారన్నారు.












Click it and Unblock the Notifications