ఫిల్మ్ సిటీకి అమిత్ షా : బీజేపీ- టీడీపీ పొత్తులకు కేంద్రంగా : కీలక వ్యక్తుల మధ్య చర్చలు..!!?
బీజేపీతో బంధం కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా టీడీపీ శ్రేయోభిలాషులు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక కీలక కలయిక పైన జాతీయ మీడియాలో కధనాలు వస్తున్నాయి. హోం మంత్రి అమిత్ షా మునుగోడు పర్యటనకు ఈ రోజు వస్తున్నారు. మునుగోడులో బహిరంగ సభ తరువాత అమిత్ షా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లనున్నారు. అక్కడ 30- 45 నిమిషాల పాటు ఉండనున్నారు. అక్కడ ప్రముఖ మీడియా సంస్థల అధినేతతో సమావేశం కానున్నట్లు చెబుతున్నారు. వీరిద్దరి మధ్య సత్సంబధాలు..పరస్పర గౌరవం ఉంది.

బీజేపీ - టీడీపీ మధ్య బంధం దిశగా
వీరిద్దరిది మర్యాద పూర్వక సమావేశం అని చెబుతున్నా..ఆ భేటీలో మరోసారి బీజేపీ - టీడీపీ మధ్య పొత్తు అంశం పైన చర్చ ప్రతిపాదన రానుందని ఆ కధనాల సారాంశం. టీడీపీ నుంచి బీజేపీలో చేరి..ఈ మధ్య కాలంలోనే మాజీ అయిన రాజ్యసభ సభ్యుడు ఈ సమావేశం వెనుక కీలకలంగా ఉన్నారని తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ పట్టుదలతో ఉంది.
అదే సమయంలో ఏపీలో అధికారం దక్కించుకోవటం ఈ సారి చంద్రబాబు కు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. తెలంగాణలో టీడీపీకి పట్టు తగ్గినా.. కొన్ని నియోజకవర్గాల్లో పరోక్షంగా ప్రభావం చేయగల సమర్ధత ఉందని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ లక్ష్య సాధనలో చంద్రబాబు సహకారం.. ఏపీలో టీడీపీకి బీజేపీ మద్దతు ..అనే పరస్పర అవగాహనతో మరోసారి ఒప్పందం ఫార్ములాను తెర మీదకు తెస్తున్నారు.

పరస్పర సహకారం - అంగీకారం కుదిరేనా
తెలంగాణలో టీడీపీ రాజకీయ పోరాటాలకు దాదాపుగా దూరంగా ఉంటుంది. అదే సమయంలో.. టీడీపీ గతంలో ప్రభావితం చేసిన వర్గాలు..ప్రాంతాలు ఇప్పుడు పూర్తిగా కేసీఆర్ కు మద్దతుగా ఉన్నాయి. అయితే, చంద్రబాబు తో తెలంగాణలో అవగాహన కుదుర్చుకుంటే పార్టీకి నష్టమేననే వాదన బీజేపీ నేతల నుంచి వినిపిస్తోంది.
గ్రేటర్ లో కొంత మేర కలిసి వచ్చినా.. గతంలో కేసీఆర్ ఎన్నికల వేళ చంద్రబాబును తెలంగాణ ద్రోహిగా ప్రచారం చేసి రాజకీయంగా లబ్ది పొందిన విషయాన్ని బీజేపీ తెలంగాణ నేతలు గుర్తు చేస్తున్నారు. తాజాగా.. తెలంగాణ బీజేపీ సీనియర్ నేతలు సైతం ఆ ప్రతిపాదన సరి కాదనే అభిప్రాయం వ్యక్తం చేసారు. ఇక, ఏపీలో.. బీజేపీ అధినాయకత్వం వైసీపీకి మద్దతుగా ఉంది. జాతీయ స్థాయిలో ఎన్డీఏలో భాగస్వామిగా లేకున్నా... ప్రధాని మోదీ- సీఎం జగన్ మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి.

జగన్ ను కాదని..చంద్రబాబు కు క్లియర్ అవుతుందా
చంద్రబాబు తిరిగి మోదీకి దగ్గర కాకుండా జగన్ తన ప్లాన్ తాను అమలు చేస్తున్నారు. దీంతో..హైదరాబాద్ కేంద్రంగా ముందుగా అమిత్ షా తో చర్చల ద్వారా.. తిరిగి పొత్తు కోసం టీడీపీ శ్రేయోభిలాషుల చర్చలకు ఈ సమావేశం వేదిక కానుందనేది జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ, చంద్రబాబుతో పొత్తుకు ప్రధాని మోదీ సుముఖంగా లేరనేది బీజేపీ ముఖ్యనేతలు తరచూ చెప్పే అంశం.
అయితే, రాజకీయాల్లో చివరి నిమిషం వరకూ ఏదైనా జరిగే అవకాశం ఉంటుందని టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. దీంతో..ఇప్పుడు ఈ భేటీలో ఏం జరగబోతోంది...టీడీపీ - బీజేపీ మధ్య బంధానికి మరోసారి పునాదులు పడతాయా అనేది స్పష్టత రావాల్సి ఉంది. దీంతో..ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారుతోంది.












Click it and Unblock the Notifications