బుల్లెట్ గాయం: కాశ్మీర్‌లో అనకాపల్లి జవాను మృతి
విశాఖపట్నం: జమ్మూకాశ్మీర్‌లో ఆర్మీ జవానుగా విధులు నిర్వహిస్తున్న విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లికి చెందిన ఆర్మీ జవాను సేనాపతి నాయుడుబాబు(27) బుల్లెట్ తగలడంతో మృతి చెందాడు. దీంతో అతని స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. జమ్మాకాశ్మీర్‌లోని నౌసిరా సైనిక సెక్టార్‌లో జవానుగా విధులు నిర్వహిస్తున్న అనకాపల్లి మండలం కూండ్రం గ్రామానికి చెందిన సేనాపతి నాయుడుబాబు గురువారం రాత్రి మృతి చెందాడు. ఈ మేరకు కుటుంబసభ్యులకు సమాచారం అందింది.

బుల్లెట్ తగలడంతో నాయుడుబాబు మృతి చెందాడని చెబుతున్నప్పటికీ అతని మృతికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నాయుడుబాబు ఐదేళ్ల క్రితమే సైన్యంలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. పంజాబ్‌లో కొంతకాలం పనిచేశాక జమ్మూకాశ్మీర్ బదలీ అయ్యాడు.
మృతికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియలేదని అతని కుటుంబసభ్యులు తెలిపారు. సంక్రాంతికి వస్తానని ఇటీవలే ఫోన్ చేసి చెప్పాడని వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్న నాయుడుబాబు తల్లిదండ్రులు చెప్పారు. నాయుడుబాబుకు ఇటీవల వివాహం నిశ్చయించామని, ఫిబ్రవరిలో పెళ్లి చేసేందుకు నిర్ణయించామని తెలిపారు. ఇంతలోనే తమ కుమారుడు చనిపోయాడన్న వార్త వినడంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు.












Click it and Unblock the Notifications