భయంకపితులను చేసిన ఆ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఘటనలో అసలు విషయాలు వెలుగులోకి
థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం గాల్లో తీవ్రమైన కుదుపులకు లోనైన ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 33,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోన్న ఈ విమానం ఒక్కసారిగా 300 అడుగుల కిందకు జారిపోయిన నాటి ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. నాటి ఘటన అనంతరం ఈ ఫ్లైట్ ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయినప్పటికీ.. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
దీని తర్వాత పైలెట్లకు నిర్వహించిన డోప్ పరీక్షల్లో సంచలన విషయాలు బయటికొచ్చాయి. ప్రమాద సమయంలో విమానాన్ని నడిపిన ప్రధాన కెప్టెన్‌కు నిర్వహించిన డోప్ టెస్ట్ పాజిటివ్‌గా వెలువడింది. పోస్ట్ ఫ్లైట్ డోప్ టెస్ట్ ఇది. న్యూఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే నిబంధనల ప్రకారం పైలట్లకు ఈ డోప్ పరీక్షలను నిర్వహించగా.. పైలెట్ ఇన్ కమాండ్ శరీరంలో సైకోయాక్టివ్ పదార్థాల ఆనవాళ్లు ఉన్నట్లు ప్రాథమిక ల్యాబ్ రిపోర్టుల్లో తేలింది. ఈ నేపథ్యంలో దీనిపై తుది ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

దీనిపై ఎయిర్ ఇండియా సంస్థ యాజమాన్యం స్పందించింది. తుది ల్యాబ్ రిపోర్టులు అధికారికంగా తమ చేతికి అందేంత వరకు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేమని తెలిపింది. భద్రతా ప్రమాణాల దృష్ట్యా దర్యాప్తు పూర్తయ్యే వరకు ఇద్దరు పైలెట్లను కూడా విధుల నుంచి తప్పించామని వివరించింది. సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ చేపట్టిన ఏ దర్యాప్తునకైనా పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేసింది.
ఈ నెల ఆగస్టు 4న చోటు చేసుకున్న ఘటన ఇది. 137 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది క్రూ తో ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ 2379 మార్గ మధ్యలో అకస్మాత్తుగా సమతుల్యతను కోల్పోయింది. కుదుపులకు గురైంది. ఒక్కసారిగా కిందికి జారింది. నిర్దేశిత పాథ్ వే నుంచి 300 అడుగులు కిందకు పడిపోవడంతో ప్రయాణికులు ప్రాణభయంతో అల్లాడిపోయారు. ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది గాయపడ్డారు. ఇద్దరు క్యాబిన్ సిబ్బందికి వెన్నెముక, మెడ భాగాల్లో గాయాలయ్యాయి.
పైలట్లు డోప్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలితే కఠిన శిక్షలు ఉంటాయి. మొదటిసారి ఈ తప్పు చేసినట్లు రుజువైతే సదరు ఉద్యోగిని విధుల నుంచి తప్పిస్తారు. రిహాబిలిటేషన్ సెంటర్ కు పంపిస్తారు. నెగెటివ్ రిపోర్టులు వచ్చాకే తిరిగి విధుల్లోకి తీసుకుంటారు. అదే రెండోసారి విఫలమైతే లైసెన్స్ మూడేళ్ల పాటు సస్పెండ్ అవుతుంది. మూడోసారి కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే ఏవియేషన్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేస్తారు.




Click it and Unblock the Notifications