ఏపీ స్థానిక పోరులో కూటమి ఉమ్మడి అజెండాపై బీజేపీ మంత్రి కీలక ప్రకటన...!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. బీసీ రిజర్వేషన్లతో పాటు కోర్టుల్లో దాఖలైన కేసుల్ని సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేసుకుని ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ ఎన్నికల్లో కూటమి పార్టీలు గత ఎన్నికల తరహాలోనే ఉమ్మడి అజెండాతో, సీట్ల పంపకాలతో ముందుకెళ్తాయా లేక వేర్వేరుగా పోటీ చేస్తాయా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కూటమిలో భాగస్వామి అయిన జనసేన, బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలే ఇందుకు నిదర్శనం.
వీటిపై ఇవాళ బీజేపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ (satya kumar Yadav ) స్పందించారు. రాష్ట్రంలో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయంతో పని చేస్తున్నాయని ఆయన తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు ఉమ్మడి అజెండాతో ప్రజల ముందుకు వెళ్లతాయని సత్య కుమార్ వెల్లడించారు. దీంతో ఎన్టీయే పక్షాల అజెండాపై క్లారిటీ వచ్చింది. అలాగే సీఎం చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తోపాటు బీజేపీ దీర్ఘకాలం కలిసి పనిచేయాలని ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 15, 20 ఏళ్ల పాటు కొనసాగాలనే ఆలోచన వారిలో ఉందని మంత్రి సత్య కుమార్ వెల్లడించారు. ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోందని ఆయన గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ఈ మూడు పార్టీలు దృష్టి సారించాయని తెలిపారు. ఇందుకు తగినట్లుగానే తాము సన్నద్ధమవుతున్నట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. సత్యకుమార్ ప్రకటనతో కూటమి పార్టీల సమన్వయంపై నెలకున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది.














Click it and Unblock the Notifications
