కేంద్రంలో మళ్లీ ధర్డ్ ఫ్రంట్ ? ఇండీ కూటమిని కెలుకుతున్న డీఎంకే..! గతంలో ఏం జరిగింది ?
తమిళనాడులో దశాబ్దాలుగా తమకు నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. విజయ్ టీవీకే స్ధాపించి అధికారంలోకి రాగానే, తమకు ఝలక్ ఇచ్చి ఆయన కూటమిలో చేరిపోవడంతో డీఎంకే రగిలిపోతోంది. కాంగ్రెస్ నిర్ణయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్న డీఎంకే.. ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ఇండియా కూటమిలో ఉండలేక, బయటికి వెళ్లలేక సతమతం అవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ (Third Front) ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా డీఎంకే అధినేత స్టాలిన్ సోదరి, ఎంపీ కనిమొళి రంగంలోకి దిగారు.
డీఎంకే ధర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు (Third Front)
ఇప్పటికే కనిమొళి ముంబై వెళ్లి ఉద్దవ్ శివసేన నేత ఉద్ధవ్ థాక్రేను, ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియా సూలేను కలిశారు. అనంతరం బెంగాల్ వెళ్లి మాజీ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీని కలిసేందుకు కనిమొళి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా ఇప్పటికీ ఇండీ కూటమిలో ఉన్న పలు ప్రాంతీయ పార్టీలను కలుపుకుని థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు డీఎంకే ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం డీఎంకేకు తమిళనాడులో అసెంబ్లీ కంటే జాతీయ స్ధాయిలో ఎక్కువగా బలం ఉంది. లోక్ సభలో 22 మంది, రాజ్యసభలో 11 మంది కలుపుకుని డీఎంకేకు మొత్తం పార్లమెంట్ లో 33 మంది ఎంపీలున్నారు. వీరిలో కనీసం 22 మంది ఎంపీలు 2029 వరకూ లోక్ సభలో ఉంటారు.

ఇండీ కూటమిపై ఫోకస్
ఈ బలాన్ని చూపి, ఇండీ కూటమిలోని ప్రాంతీయ పార్టీల్ని ఆకర్షించేందుకు కనిమొళి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఇండియా కూటమి సమావేశాలకు డీఎంకే హాజరు కావడం లేదు. డీఎంకే వైఖరి వల్ల అటు విజయ్ టీవీకే సైతం ఇండీ కూటమిలోకి రాలేకపోతోంది. గత పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు, తన పార్టీ ఎంపీలకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేయాలని కనిమొళి రాసిన లేఖపై స్పీకర్ ఓం బిర్లా సానుకూలంగా స్పందించి ప్రత్యేక సీటింగ్ ఇచ్చారు. ఆగస్టులో స్పీకర్ ఏర్పాటు చేసిన సాంప్రదాయ టీ పార్టీని ఇండీ కూటమి బహిష్కరించినా, కనిమొళి మాత్రం హాజరయ్యారు.

ధర్డ్ ఫ్రంట్ ప్రయోగాలన్నీ విఫలం
అయితే కాంగ్రెస్ లేకుండా ధర్డ్ ఫ్రంట్ ఆలోచనలు గతంలో చాలా రాజకీయ పార్టీలు చేసి విఫలమయ్యాయి. 2013లో కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో సమాఖ్య కూటమిని ఏర్పాటు చేయాలని మమతా బెనర్జీ స్వయంగా ప్రతిపాదించారు. ఐదేళ్ల తర్వాత 2019 ఎన్నికలకు ముందు అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్‌లతో భేటీలు నిర్వహించారు. అయినా ఎన్నికలకు ముందు అవి కాస్తా నీరుగారిపోయాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రతిపక్ష రాష్ట్రాలకు చెందిన ఏడుగురు ముఖ్యమంత్రులకు విందుకు ఆహ్వానం పంపినా ఫలించలేదు. ఈసారి డీఎంకే చేస్తున్న ప్రయత్నాలకు ఏ మేరకు ఇతర విపక్ష పార్టీలు స్పందిస్తాయన్నది త్వరలో తేలిపోనుంది.














Click it and Unblock the Notifications
