వరంగల్ కేంద్రంగా సైబర్ ముఠా..దేశవ్యాప్తంగా 185 సైబర్ నేరాలతో లింకులు!
వరంగల్‌లో అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠా గుట్టు రట్టు చేశారు వరంగల్ కమీషనరేట్ పోలీసులు. సైబర్ మోసాల కేసులో 22 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వీరికి దేశవ్యాప్తంగా 185 సైబర్ నేరాలతో లింకులు ఉన్నట్టు గుర్తించారు. వరంగల్ కేంద్రంగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ దందాను, ఈ సైబర్ నేరగాళ్ళ ముఠాను అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు.
ముద్ర రుణాల పేరుతో అమాయకుల బ్యాంకు ఖాతాలను సేకరించి వాటి ద్వారా వీరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వరంగల్ కేంద్రంగా ముఠా నుంచి 216 బ్యాంక్ పాస్‌బుక్‌లు, 8 చెక్‌బుక్‌లు, 22 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పలు సిమ్ కార్డులు, స్మార్ట్ ఫోన్లు, రెండు కార్లు, హార్డ్ డిస్క్‌లు, క్యూఆర్ స్కానర్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ముఠా బాధితులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పిస్తామని నమ్మించి, వారి పేర్ల మీద బ్యాంకు ఖాతాలు తెరిపించి, ఆ తర్వాత రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు కమిషన్ ఇస్తామని చెప్పి నమ్మించి పాస్‌బుక్‌లు, ఏటీఎమ్ కార్డులు, చెక్‌బుక్‌లను తీసుకునే వారు. సైబర్ నేరాల ద్వారా వచ్చిన అక్రమ డబ్బును ఈ మ్యూల్ ఖాతాల ద్వారా మళ్లించేవారు.
వరంగల్ కేంద్రంగా మొదలైన ఈ నెట్‌వర్క్ ఢిల్లీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల వరకు విస్తరించింది. దర్యాప్తులో ఈ ముఠాకు దేశవ్యాప్తంగా నమోదైన 185 సైబర్ నేర కేసులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు తేలింది. ప్రధాన సూత్రధారుల కోసం గాలించిన పోలీసులు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
మిగిలిన నలుగురు కీలక నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి తమ బ్యాంక్ ఖాతాలు, వ్యక్తిగత వివరాలు ఇతరులకు అమ్మవద్దని వరంగల్ పోలీస్ కమీషనరేట్ కమీషనర్ శ్వేత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి దందాల్లో పాల్గొంటే చట్టపరమైన చిక్కులు ఎదురవుతాయని పోలీసులు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications
