దూసుకొస్తున్న అల్పపీడనం: పిడుగులు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సెప్టెంబర్ 18 సాయంత్రానికి ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశించనుంది. దీని ప్రభావంతో సెప్టెంబర్ 19 నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో ఏపీతో పాటుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
కాగా.. ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.రాష్ట్రంలో పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది.

పలు జిల్లాలో ఉరుములతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లావాసులు అప్రమత్తంగా వ్యవహరించాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గుంటూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని సంస్థ వెల్లడించింది. ఈ మేరకు జిల్లావాసులు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేసింది. గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున, వర్షాలు, పిడుగుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈనెల 19వ తేదీ నాటికి ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో.. దీని ప్రభావంతో వచ్చే వారం కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.














Click it and Unblock the Notifications
