ఏపీకి మరో చల్లని కబురు- రేపటి నుంచి మళ్లీ వర్షాలు-ఈ జిల్లాల్లో..!
ఎల్ నినోతో అల్లాడుతున్న ఏపీ ప్రజలకు మరో శుభవార్త (AP Weather). బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. మరో మూడు రోజుల్లో అల్పపీడనం ఏర్పడబోతోంది. దీని ప్రభావంతో రేపటి నుంచే వర్షాలు మళ్లీ పలకరించబోతున్నాయి. ప్రస్తుతానాికి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై సముద్ర మట్టానికి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందన్నారు.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం సాయంత్రం నాటికి ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఆ అనంతరం 3-4 రోజులలో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో వచ్చే వారం కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. రేపు అల్లూరి, పోలవరం, కృష్ణా, గుంటూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఈదురుగాలులతో వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నాటికి కాకినాడ జిల్లా రౌతులపూడిలో 68.6మిమీ, అనకాపల్లి జిల్లా మర్రిపాలెంలో 54మిమీ, కాకినాడ జిల్లా డి.పోలవరంలో 48.5మిమీ, కాకినాడ జిల్లా కోనపాపపేట 46.8మిమీ, విశాఖ జిల్లా అక్కిరెడ్డిపాలెంలో 45.5మిమీ, అనకాపల్లిలో 44.5మిమీ, పాయకరావుపేటలో 43.7మిమీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. రేపు ఈ వర్షాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించబోతున్నాయి.














Click it and Unblock the Notifications
