ఉత్తరాంధ్రకు అల్పపీడనం ముప్పు-సర్కార్ అలర్ట్-కంట్రోల్ రూమ్స్..!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై (Northern Andhra) కనిపిస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) అప్రమత్తమైంది. అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు అందడంతో ఆ మేరకు అధికారుల్ని అప్రమత్తం చేస్తోంది. అలాగే వర్షాల వల్ల ఎదురయ్యే సమస్యలపై ఫిర్యాదులు చేసేందుకు, సాయం పొందేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసింది.
అల్పపీడనం (Low-Pressure) వల్ల కురిసే వర్షాల (rains) వల్ల ఎటువంటి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నెంబర్లు 112, 1070, 1800 425 0101 ను విడుదల చేశారు. అల్పపీడనం పరిస్థితిపై ఎప్పటికప్పుడు ప్రజలకు హెచ్చరిక సందేశాలు పంపాలని హోంమంత్రి అనిత ఆదేశించారు.

బంగాళాఖాతంలో నెలకున్న అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్రలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. రానున్న మూడు రోజుల పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత కోరారు. దీని వల్ల తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హోంమంత్రి సూచించారు.














Click it and Unblock the Notifications
