అమిత్ షా ప్రోగ్రామ్స్ కు ముస్లిం అధికారులకు నో ఎంట్రీ? -ఐరాసకు టీఎంసీ ఎంపీ..!
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) పాల్గొంటున్న అధికారిక కార్యక్రమాలకు సైతం ముస్లిం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని హాజరు కానివ్వకుండా దూరంగా ఉంచుతున్నారని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) ఆరోపించారు. ఈ మేరకు అమిత్ షా పాల్గొన్న ఏయే కార్యక్రమాలకు ఏయే సీనియర్ అధికారుల్ని దూరంగా ఉంచారో వెల్లడిస్తూ ఓ జాబితా విడుదల చేశారు. అక్కడితో ఆగకుండా ఐక్యరాజ్యసమితిలోని మైనార్టీ సమస్యల ప్రత్యేక ప్రతినిధికి ఆమె ఫిర్యాదు చేశారు.
టీఎంసీ మహువా మొయిత్రా విడుదల చేసిన జాబితాలో అమిత్ షా పాల్గొన్న మొత్తం ఏడు కార్యక్రమాలు ఉన్నాయి. వీటిలో జూలై 18న సిలిగురిలో జరిగిన సరిహద్దు భద్రతా సమీక్షలో స్థానిక సీపీగా ఉన్న సయ్యద్ వకార్ రజాను వెళ్లిపోవాలని ఆదేశించినట్లు ఆరోపించారు. అదే రోజు అక్కడే జరిగిన ప్రోటోకాల్ కార్యక్రమంలోనూ ప్రోటోకాల్ నుంచి వకార్ రజాను తప్పించడంతో పాటు అక్కడ కనిపించవద్దని చెప్పారన్నారు. అదే రోజు సిలిగురిలో జరిగిన సరిహద్దు భద్రతా సమీక్షలో ఎస్టీఎఫ్ డీజీపీ జావెద్ షమీమ్ ను రావొద్దని చెప్పినట్లు మొయిత్రా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మరో ఐపీఎస్ గౌరవ్ శర్మతో నడిపించారన్నారు.

India signatory to UN’s Universal Declaration of Human Rights 1948 & International Covenant on Civil and Political Rights. Have sent urgent appeal to UN Special Rapporteur to look into religious discrimination against IPS & IAS officers by WB & Union govt. (1/4) pic.twitter.com/vdW4tiu5Kj
— Mahua Moitra (@MahuaMoitra) September 17, 2026
జూలై 18న శాంతిభద్రతలు, విపత్తుల నిర్వహణపై జరిగిన మరో సమీక్షకు అగ్నిమాపక ఏసీఎస్ గా ఉన్న ఐఏఎస్ ఖలీల్ అహ్మద్ ను సైతం రాకుండా అడ్డుకున్నారని మెయిత్రా తెలిపారు. ఇదే సమావేశానికి మరో ఐపీఎస్ జావెద్ షమీమ్ ను కూడా రాకుండా అడ్డుకున్నారని తెలిపారు. ఆగస్టు 20న సిలిగురిలోనే నిర్వహించిన మరో సరిహద్దు సమీక్షలో ఐపీఎస్ వకార్ రజాను మరోసారి రాకుండా అడ్డుకున్నారని వెల్లడించారు. చివరిగా సిలిగురిలో ఆగస్టు 20న జరిగిన న్యాయ సంహిత ఎగ్జిబిషన్ కు సైతం ఐపీఎస్ జావెద్ షమీమ్ ను హాజరయ్యేందుకు అనుమతించలేదన్నారు. ఈ కార్యక్రమాలన్నింటిలోనూ ముస్లిం అధికారుల్ని రానివ్వకుండా అడ్డుకునేందుకు ఎలాంటి కారణం కూడా చూపలేదన్నారు. మతం అధారంగా అధికారులపై చూపుతున్న ఇలాంటి వివక్షపై చర్యలు తీసుకోవాలని ఐరాస స్పెషల్ ర్యాపోర్టూర్ ప్రొఫెసర్ నికోలస్ లెవ్రాట్ కు మొయిత్రా ఫిర్యాదు చేశారు.














Click it and Unblock the Notifications
