విజయ్ వన్ మ్యాన్ షో- పాలనను మించి కల్ట్ పాలిటిక్స్- 4 నెలల్లో జరిగిందేంటి ?
తమిళనాడులో రెండేళ్ల క్రితం టీవీకే పేరుతో రాజకీయ పార్టీని స్దాపించి, అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి, అంతే నాటకీయంగా సీఎం పదవి చేపట్టిన జోసెఫ్ విజయ్ (Vijay) తనదైన మార్కుతో దూసుకుపోతున్నారు. అయితే విజయ్ పాలన కంటే కల్ట్ రాజకీయాలపై దృష్టిపెట్టడం, వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం, వాటి విషయంలో విమర్శలు వచ్చినా లెక్కచేయకుండా ముందుకు సాగడం, సంక్షేమం చేపడితే చాలన్న ధోరణిలో వ్యవహరిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. విజయ్ 4 నెలల పాలనలో ఏం జరిగిందో సీనియర్ పాత్రికేయుడు దేవసహాయం 'ద ప్రింట్' లో రాసిన వ్యాసంలో వివరించారు.
విజయ్ టీవీకే ప్రభుత్వం తమిళనాట (Tamil Nadu) నాలుగు నెలల పాలన పూర్తి చేసుకుంది. ఈ స్వల్ప కాలంలో టీవీకే సంకీర్ణ ప్రభుత్వం తీసుకున్న ప్రధాన నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తు ఏ దిశగా సాగుతుందో స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా సినీ ప్రజాదరణతో అధికార పీఠాన్ని దక్కించుకున్న విజయ్, పాలనలో తనదైన శైలిని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రారంభంలోనే విజయ్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు తీవ్ర వివాదాలకు దారితీశాయి. ముఖ్యంగా చెన్నై సమీపంలోని ప్రతిష్టాత్మక పరంధూర్ గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టును రద్దు చేయడం ఇందులో మొదటిది. రైతు సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ కోసమే ఈ నిర్ణయమని ప్రకటించినప్పటికీ, ఆ తర్వాత సేకరించిన 5,000 ఎకరాల వ్యవసాయ భూమిని పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ అవసరాలకు మళ్లించాలని భావించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

మరోవైపు పట్టినపాక్కం తీర ప్రాంతంలో తీర నియంత్రణ మండలి (CRZ) నిబంధనలను పక్కనబెట్టి భారీ సచివాలయ నిర్మాణానికి ప్రభుత్వం సిద్దం కావడం వివాదాస్పదమైంది. సముద్ర తీరానికి అతి సమీపంలో నిర్మించే ఈ భారీ భవనం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, స్థానిక మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాజీ సీఎం స్టాలిన్ కు గతంలో తగిలిన దెబ్బను గుర్తుచేస్తూ.. ముఖ్యమంత్రి విజయ్ ప్రదర్శించిన బాడీ లాంగ్వేజ్ తీవ్ర దుమారం రేపింది. దీనిపై మిత్రపక్షాలే విమర్శలకు దిగాయి.

ప్రస్తుతం విజయ్ సర్కార్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళా భద్రతా దళాలు, మద్యం దుకాణాల తగ్గింపు వంటి సంక్షేమ పథకాల హామీలపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది. కానీ కేవలం ఉచిత పథకాలు అందించడమే నిజమైన సుపరిపాలన కాదని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. రాష్ట్రంలో పాలన అంతా సంస్థాగతంగా కాకుండా ఒక వ్యక్తి చుట్టూ తిరిగే కల్ట్ తరహా రాజకీయం వైపు మళ్లుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలలో బ్యూరోక్రసీ కంటే సినీ సలహాదారుల పాత్రే ఎక్కువగా కనిపిస్తోందని విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వంలో అవినీతిని అరికట్టేందుకు విజయ్ కొన్ని సానుకూల ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా.. ఇతర పార్టీల నేతలను చేర్చుకుని బలాన్ని నిరూపించుకోవాలనే వ్యూహాలు పారదర్శకతను దెబ్బతీస్తున్నాయి. రాజకీయ అనుభవం లేని ఒక సినీ నటుడు సోషల్ మీడియా ప్రచారాల ద్వారా అధికారాన్ని చేజిక్కించుకుని సాగిస్తున్న ఈ కొత్త పాలన రానున్న రోజుల్లో తమిళనాట ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.














Click it and Unblock the Notifications
