ట్యాంక్ బండ్ పై నిమజ్జనం బంద్.. హుస్సేన్ సాగర్ వద్ద ఆంక్షలు తీవ్రతరం.. ప్రజలు ఆగ్రహం..!
హైదరాబాద్ నగరంలో వినాయక చవితి ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. అయితే మూడో రోజు నుంచి వినాయకుని నిమజ్జనం కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఏటా హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ వందలాదిగా విగ్రహాలు నిమజ్జనానికి తరలివస్తుంటాయి. అయితే పర్యావరణ పరిరక్షణ, లేక్ కాలుష్యాన్ని నివారించే లక్ష్యంతో ట్యాంక్ బండ్ పై భారీ విగ్రహాల నిమజ్జనాన్ని పూర్తిగా నిషేధిస్తూ అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఈ ఏడాది హుస్సేన్ సాగర్ లోని ట్యాంక్ బండ్ ప్రాంతంలో వినాయక నిమజ్జనాలను పోలీసులు పూర్తిగా నిషేధించారు. హుస్సేన్ సాగర్ వద్ద ప్రత్యేక సీసీ కెమెరాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా నిమజ్జనానికి ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. అంతేకాక అక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు.
ఇటీవల హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా హెచ్చరిక ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే వినాయకుడి నిమజ్జనం ట్యాంక్ బండ్ పై కాకుండా నగర వ్యాప్తంగా జీహెచ్ ఎంసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బేబీ పాండ్లు, హుస్సేన్ సాగర్ వద్ద ఉన్న ప్రత్యామ్నాయ ప్రాంతాలైన ఎన్టీఆర్ మార్క్, పీపుల్స్ ప్లాజాలో మాత్రమే విగ్రహాలను నిమజ్జనం చేయాలని సూచించారు.

అటు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన వేడుకకు కూడా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఖరారు చేశారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఎన్టీఆర్ మార్క్ ఘాట్ వద్దే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం చేయనున్నారు. ఈ మేరకు భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మరోవైపు ట్యాంక్ బండ్ పై నిమజ్జనం బంద్ చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక ఖైరతాబాద్ మహా గణపతిని రోజూ లక్ష మంది వరకు దర్శించుకుంటారు. ఇక సెలవు రోజుల్లో ఈ సంఖ్య ఏకంగా 3 లక్షలకు పైగా చేరుతుంది. వీఐపీల దర్శనాలు కూడా ఉంటున్నాయి. అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో ఇక్కడ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తుంటారు. పోలీసులతో పాటు ప్రైవేటు సెక్యూరిటీ, వాలంటీర్లు, ఎన్ సీసీ క్యాడెట్లు కూడా ఇక్కడ సేవలు అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications
