తీవ్ర విషాదం: కలుషిత పానీయం తాగి 48 మంది మృతి.. 100 మందికిపైగా సీరియస్
ఆఫ్రికా ఖండంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో నైజీరియా టాప్ ప్లేస్ లో ఉంది. నైజీరియాలోని గ్రామీణ ప్రాంతాల్లో స్థానికంగా తయారు చేసే ఆల్కహాల్ లాంటి పానీయంను సేవించడం అక్కడ సర్వసాధారణం. అయితే నైజీరియాలో తాజాగా విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. కల్తీ పానీయం సేవించి 48 మంది మృతి చెందారు. మరో 100 మందికి పైగా సీరియస్ గా ఉంది. ప్రస్తుతం క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ పానీయంలో మిథనాల్ కలిసి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందువల్లనే మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఓండో రాష్ట్రంలోని ఒడిగ్బో, ఐరీల్ ప్రాంతాలకు చెందిన దాదాపు 182 మందికి పైగా ఈ కలుషిత పానీయం కారణంగా ప్రభావితం అయినట్లు స్టేట్ హెల్త్ కమిషనర్ బంజీ అజకా తెలిపారు.
" ఈ ఘటన చాలా వేగంగా జరిగింది. ఒక్కసారి ఈ పానీయం తాగిన వెంటనే.. ఎంత మోతాదులో తాగారో దాన్ని బట్టి కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. కళ్లు మూసుకుపోతాయి. బ్రెయిన్ పనిచేయడం ఆగిపోతుంది" అని స్టేట్ హెల్త్ కమిషనర్ బంజీ అజకా ది అసోసియేటెడ్ ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అయితే ఈ పానీయంలో మిథనాల్ అనే విషపూరితమైన మిశ్రమం కలిసి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కల్తీ పానీయాన్ని తక్కువ మోతాదులో తాగిన వాళ్లు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయినట్లు వివరించారు. ఇక ఇదే ఘటనపై ఓండో స్టేట్ పోలీస్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ అభయోమి జిమో మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధం ఉన్న 15 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశామని తెలిపారు.

నిందితుల్లో ఒకరు విషపూరితమైన మిథనాల్ తో ఈ పానీయాన్ని తయారు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించామని వివరంచారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇక స్థానిక ప్రభుత్వం సమాచారం ప్రకారం.. ఈ కలుషిత పానీయాన్ని సేవించి రెండు వారాల క్రితమే తొలి మరణం సంభవించిందని పేర్కొన్నారు. ఇక ఈ పానీయంలో మిథనాల్ లాంటి విషపూరితమైన మిశ్రమాన్ని ఎందుకు కలపాల్సి వచ్చిందో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. అయితే ఇప్పటికే 100 మందికిపైగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని.. వారిలో చాలామంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
