లాల్ దర్వాజా బోనాల: సింహవాహిని సేవలో భక్తజనం!
లాల్ దర్వాజా బోనాల పండుగ అంబరాన్నంటింది. ప్రకృతిని, మాతృమూర్తిని దైవంగా భావించి పూజించే అత్యంత ప్రాచీనమైన ఈ ఘన సంప్రదాయం, భాగ్యనగరంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తుల కష్టాలను తీర్చే గ్రామదేవతగా, విష జ్వరాలు, రోగాల నుంచి రక్షించే చల్లని తల్లిగా పూజలందుకుంటున్న లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తజనసందోహంతో కిటకిటలాడింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన మహంకాళి క్షేత్రం, ఘటాల ఊరేగింపులు, డప్పుచప్పుళ్లతో పాతబస్తీ వీధులన్నీ పులకించిపోయాయి.

అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారు బోనం సమర్పణ
ఉదయం నుంచే వేలాదిమంది మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో తలపై వేపమండలతో అలంకరించిన బోనాల కుండలను ఎత్తుకుని కాళికాదేవికి నైవేద్యం అర్పించారు. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించగా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అల.. బంగారు బోనాన్ని అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఒడిబియ్యం, చీర-సారెలతో అమ్మవారిని ఆరాధించారు. అలాగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి శాంతి కళ్యాణోత్సవం కంటికి ఇంపుగా సాగింది.
Vijay Deverakonda, filmmaker Sandeep Reddy Vanga and actor Anand Deverakonda visited Hyderabad's historic #LalDarwazaMahankaliTemple to seek Goddess Mahankali's blessings on the auspicious occasion of Bonalu. #VijayDeverakonda #SandeepReddyVanga #AnandDeverakonda #Bonalu pic.twitter.com/Z6jXlZk2M5
— Hyderabad Times (@HydTimes) August 9, 2026
ఒకే వేదికపైకి రాజకీయ, సినీ ప్రముఖులు
సింహవాహిని అమ్మవారిని దర్శించుకోవడానికి పలువురు రాజకీయ, సినీ రంగానికి చెందిన ప్రముఖులు పోటీపడ్డారు. మంత్రి సీతక్క, ఎంపీ అనిల్ యాదవ్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో పాటు టాలీవుడ్ కథానాయకుడు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ప్రముఖ గాయని మంగ్లీ తదితరులు అమ్మవారి పాదాల చెంత ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధర్మకర్తలు, అర్చకులు వారికి అమ్మవారి శేషవస్త్రాలు కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు.
పటిష్ట భద్రత... క్యూలైన్లలో భక్తులకు వసతులు
సుమారు ఐదు లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారనే అంచనాతో అధికారులు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. బోనాలతో వచ్చే మహిళల కోసం ప్రత్యేక మార్గంతో పాటు మొత్తం 6 క్యూలైన్‌లను అందుబాటులోకి తెచ్చారు. లాల్ దర్వాజా పరిసరాల్లోని వేలాది చిన్న ఆలయాల్లోనూ బోనాల సందడి నెలకొంది. ఎలాంటి అసౌకర్యం కలగకుండా 2,500 మంది పోలీసులతో బందోబస్తు, 100 సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ, మెడికల్ క్యాంపులు, తాగునీటి సదుపాయాలు కల్పించారు. సోమవారం జరగబోయే రంగం -భవిష్యవాణి, పోతురాజుల విన్యాసాలు, అంబారీపై అమ్మవారి భవానీ రథయాత్రతో ఈ వేడుకలు ముగియనున్నాయి.




Click it and Unblock the Notifications