రష్యా-భారత్-చైనాలకు ట్రంప్ షాక్..! బ్రిక్స్ కోపం తీర్చుకున్నారా ?
ఓవైపు ఇరాన్ వార్ వైఫల్యాలు, మరోవైపు ముంచుకొస్తున్న మధ్యంతర ఎన్నికలు, ఇంకోవైపు బ్రిక్స్ సదస్సులో ఏకమైన భారత్-చైనా-రష్యా దేశాధినేతలు.. ఇవన్నీ కలిపి అమెరికా (US) అధ్యక్షుడు ట్రంప్ ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేశాయి. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్ధితుల్లో చిక్కుకున్న ట్రంప్.. ఈ మూడు దేశాలపై కొరడా ఝళిపించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై 100 శాతం సుంకాలను విధించే బిల్లుకు అమెరికా కాంగ్రెస్ భారీ మెజార్టీతో ఆమోదముద్ర వేసింది. దీంతో ట్రంప్ కు రష్యాతో పాటు భారత్, చైనాలకు చుక్కలు చూపించే అవకాశం లభించబోతోంది.
రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోళ్లు చేస్తున్నందుకు భారత్, చైనా సహా పలు దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కల్పించే ఆంక్షల బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఇవాళ ఆమోదించింది. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడులకు ప్రతిగా ఆ దేశంపై ఆంక్షలు, సుంకాలు విధించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుకు రిపబ్లికన్లతో పాటు చాలా మంది డెమొక్రాట్లు కూడా మద్దతిచ్చారు. దీంతో అమెరికా ప్రతినిధుల సభలో ఈ బిల్లును 262-159 ఓట్ల తేడాతో నెగ్గింది. గత నెలలో అమెరికా సెనేట్‌లో 86-11 ఓట్ల తేడాతో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఇప్పుడు ప్రతినిధుల సభలోనూ నెగ్గడంతో తుది ఆమోదం కోసం ట్రంప్ వద్దకు వెళ్లనుంది. ట్రంప్ ఈ చట్టంపై సంతకం చేసి దాన్ని అమలులోకి తీసుకొస్తారు.

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం విషయంలో ఆ దేశంపై ఆర్థిక ఒత్తిడిని పెంచడమే ఈ చట్టం లక్ష్యం. ఈ చట్టంతో రష్యా ఇంధన, రక్షణ రంగాలను, అలాగే ఇప్పటికే ఉన్న ఆంక్షలను తప్పించుకోవడానికి మాస్కోకు సాయం చేస్తున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశాలపైనా సుంకాల రూపంలో షాకులు ఖాయం. భారత్ కు సంబంధించి రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేసే దేశాలపై అధిక ద్వితీయ సుంకాలను విధించే అధికారాన్ని ట్రంప్‌కు ఇవ్వడమే అత్యంత ముఖ్యమైన నిబంధన. రష్యా చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేస్తూనే ఉన్న దేశాలపై 100 శాతం వరకు సుంకాలను విధించడానికి ఈ చట్టం అనుమతిస్తుంది. ఈ నిబంధన వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉన్న ప్రధాన కొనుగోలుదారులుగా భారత్, చైనాలను కాంగ్రెస్ చర్చలో ప్రత్యేకంగా గుర్తించారు. తాజాగా బ్రిక్స్ సదస్సులో అమెరికాకు వ్యతిరేకంగా ఒక్కటైన రష్యా-చైనా-భారత్ దేశాధినేతలు పుతిన్- జిన్ పింగ్-మోడీలకు ట్రంప్ ఇచ్చిన షాక్ గా దీన్ని భావిస్తున్నారు.














Click it and Unblock the Notifications
