ఏపీలో ఈ నెల 15వ తేదీ నుంచి.. !!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ఓ నూతన కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టింది. ఈ నెల 15వ తేదీన దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దీనికి శ్రీకారం చుట్టబోతోంది. ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికల్లో ప్రజలను నేరుగా భాగస్వామ్యులను చేయడం దీని ఉద్దేశం.
ఏపీ పునర్నిర్మాణం, దేశ ప్రగతిలో ప్రతి ఒక్క పౌరుడినీ సమాన భాగస్వామిని చేయడమే లక్ష్యంగా ఆగస్టు 15న చంద్రబాబు దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తును స్వయంగా తీర్చిదిద్దే కీలక బాధ్యతాయుత భాగస్వాములుగా ప్రతి పౌరుడూ మారాలని ఆయన ఆకాంక్షిస్తోన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా మలచాలని భావిస్తోన్నారు. దీనికి సంబంధించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

దీనిపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పలు జిల్లాల కలెక్టర్లు వర్చువల్ గా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. యువత ఆలోచనలను జాతి నిర్మాణం కోసం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని, ప్రజలు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా కాకుండా రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనలో స్టేక్ హోల్డర్లుగా మారాలని అన్నారు.
ఇందులో భాగంగా పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని ఓ మాస్ మూవ్‌మెంట్‌గా తీర్చిదిద్దాలని, ఈ క్రమంలో యువత, విద్యార్థులు కీలక పాత్ర పోషించేలా ఈ కార్యక్రమాలను రూపొందించాలని చంద్రబాబు చెప్పారు. యువత గ్రామ స్థాయి నుంచి వివిధ రంగాల్లో నాయకులుగా ఎదిగేందుకు అవసరమైన వేదికలను సృష్టించాలని, వారిలో స్వచ్ఛంద సేవా స్ఫూర్తిని పునరుద్దరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు ఏపీలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేసేలా చూడాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. మై నేషన్, నేషన్ ఫస్ట్ అనే భావన ప్రతి ఇంటికీ చేరాలని, ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి రగిలించాలని, 2047 నాటికి వికసిత భారత్ సాధనకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేసేలా ప్రొత్సహించాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం, దేశ భవిష్యత్ నిర్మాణంలో యువతదే ప్రధాన పాత్ర అని వ్యాఖ్యానించారు.




Click it and Unblock the Notifications