Visakhapatnam –Bengaluru: విశాఖ-బెంగళూరు ప్రయాణికులకు అలర్ట్-ఇకపై ఈ రైళ్లు..!
పండుగల సీజన్ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతీ రైల్వే జోన్ లోనూ ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. అందులోనూ నిత్యం రద్దీగా ఉండే విశాఖపట్నం- బెంగళూరు మార్గంలోనూ రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మార్గంలో ప్రయాణించే వారి కోసం దక్షిణ కోస్తా రైల్వే ప్రత్యేక రైళ్లను పొడిగిస్తోంది. రద్దీ నేపథ్యంలో ఇప్పటికే నడుస్తున్న రెండు రైళ్లను (Visakhapatnam-Bengaluru Special Trains) మరికొంతకాలం పొడిగిస్తూ అధికారులు తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
ఇందులో ముందుగా ప్రతీ శుక్రవారం నడుపుతున్న రైలు నంబర్ 08581 విశాఖపట్నం- SMVT బెంగళూరు ప్రత్యేక రైలు ( వయా కాట్పాడి, జోలార్‌పేట )ను అక్టోబర్ 2 నుంచి నవంబర్ 27 వరకూ పొడిగించారు. అలాగే ప్రతీ శనివారం నడుపుతున్న SMVT బెంగళూరు-విశాఖపట్నం ప్రత్యేక రైలు నంబర్ 08582ను కూడా అక్టోబర్ 3 నుంచి నవంబర్ 28 వరకూ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు రైళ్లూ ప్రస్తుతం రాకపోకలు సాగిస్తుండగా.. వీటిని నవంబర్ చివరి వారం వరకూ పొడిగించారు. ఈ లెక్కన ప్రతీ రైలూ అదనంగా 9 ట్రిప్పులు వేయబోతోంది.

ఈ రెండు ప్రత్యేక రైళ్లకు ప్రస్తుతం ఉన్న సమయాలు, స్టాపేజీలు, కోచ్‌ల కూర్పుతోనే పొడిగిస్తున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే ప్రకటించింది. తద్వారా ప్రయాణికులకు ఎలాంటి గందరగోళం లేకుండా ప్రయాణాలు సాగించేందుకు అవకాశం ఉంటుంది. ఈ రెండు రైళ్లను నవంబర్ 28 నాటికి రద్దీని పరిశీలించి, అనంతరం మరోసారి పొడిగించాలా లేక రద్దు చేయాలా అన్న నిర్ణయం తీసుకుంటారు.కాబట్టి ప్రయాణికులు ఎప్పటికప్పుడు రైల్వే అప్ డేట్స్ ను గమనించాల్సి ఉంటుంది.














Click it and Unblock the Notifications
