తెలంగాణాలో విమోచనా దినోత్సవం కేంద్రమంత్రుల సాక్షిగా అధికారికంగా చేసిన కేంద్రం!
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించింది కేంద్రం. 'ఆపరేషన్ పోలో' ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ ప్రాంత స్వేచ్ఛ కోసం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అమరులకు, విమోచన పోరాట వీరులకు పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు.
ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ మాట్లాడుతూ... హైదరాబాద్ కథ భారత్‌లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని అన్నారు. 500 కంటే ఎక్కువ సంస్థానాలను విలీనం చేసి దేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడటంలో సర్దార్ పటేల్ నిర్ణయాత్మక పాత్ర పోషించారని కొనియాడారు. హైదరాబాద్ విమోచన పోరాట వివరాలు, మన పూర్వీకుల త్యాగాలను నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ తెలిపారు.

కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ... ఆపరేషన్ పోలో కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, అధర్మంపై ధర్మం సాధించిన విజయమని అభివర్ణించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ... దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత సిద్ధించిన హైదరాబాద్ విమోచన భారత చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టమని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల పర్యటనలో కొమురం భీమ్ వంటి వీరుల సాయుధ పోరాటం గురించి తెలుసుకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ఇది ఐదోసారి అని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. ఓటు బ్యాంకు రాజకీయం కోసమే గత ప్రభుత్వాలు, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నైజాం పాలనను పొగుడుతూ నిజమైన చరిత్రను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ... నైజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలపై పోరాడిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఏర్పాటు చేసిన రెండు రోజుల ఫోటో ప్రదర్శనను ఉపర్రాష్ట్రపతి సందర్శించారు. ఆయనతో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, పలువురు సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.













Click it and Unblock the Notifications
