పెళ్లాం కూడా వెంటరాదు: జగన్, నేను నమ్మలేదు.. భూమాకు చురక
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆనం విజయ్ కుమార్ వైసిపిలో చేరారు. ఆయన, ఆయన అనుచరులు పార్టీ అధినేత జగన్ సమక్షంలో వైసిపిలో చేరారు. ఈ సందర్భంగా జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రాజకీయాల్లో విశ్వసనీయత లేకుంటే పెళ్లాం కూడా వెంట నడవదన్నారు.
ప్రతిపక్షమంటే ప్రజల గోంతు అన్నారు. ప్రజల గొంతు వినిపించకుండా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో విశ్వసనీయత, వ్యక్తిత్వం అవసరమని చెప్పారు. ఎన్నికలకు ముందు అబద్దాలు చెప్పి చంద్రబాబు రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేశారన్నారు.
ఎన్నికలప్పుడు చెప్పిన మాటలను కూడా చంద్రబాబు నెరవేర్చడం లేదన్నారు. ప్రజా బలం ఉన్నంత వరకు తనకు ఎలాంటి భయం లేదని చెప్పారు. ఎన్నీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. బ్రిటిష్ సామ్రాజ్యం, హిట్లర్ వంటి వారే కూలిపోయారన్నారు.

తాను నాడు సోనియా గాంధీకే భయపడలేదని, ఇప్పుడు చంద్రబాబుకు భయపడతానా అని జగన్ అన్నారు. విపక్ష పార్టీ టికెట్ మీద గెలిచిన వాళ్లను ప్రలోభాలకు గురిచేస్తున్న చంద్రబాబు అత్యంత నీతిమాలిన వ్యక్తి అన్నారు. వైసీపీ టికెట్ పైన గెలిచి టిడిపిలో చేరిన 8 మందితో ఏర్పడ్డ నష్టం ఒక్క ఆనం విజయ్ చేరికతో తీరిపోయిందన్నారు.
అబద్దాలు చెబితే బంగాళాఖాతంలో కలవడం ఖాయమని చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు చేస్తున్న అన్యాయానికి వచ్చే ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్లు కూడా దక్కయని జోస్యం చెప్పారు. నేను ఎప్పుడూ నేతలను నమ్ముకోలేదని, ప్రజలను, దేవుడిని మాత్రమే నమ్ముకున్నానని చెప్పారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నప్పుడుకు ఆయనపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఆనం విజయ్ కుమార్‌ను నా పార్టీలోకి, నా గుండెల్లోకి ఆహ్వానిస్తున్నానని జగన్ చెప్పారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడటం అనవసరమన్నారు.
భూమాకు కౌంటర్
తాను ప్రజలను, దేవుడిని నమ్ముకున్నానని, తాను చంద్రబాబులా నేతలను నమ్ముకోలేదని జగన్ వ్యాఖ్యానించారు. ఇటీవల వైసిపి నుంటి టిడిపిలో చేరిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జగన్ బాగా నమ్మిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ, కృష్ణా జిల్లా ఎమ్మెల్యే జలీల్ ఖాన్, కడప జిల్లా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తదితర ఎనిమిది మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరిన విషయం తెలిసిందే. భూమా, ఇతర ఎమ్మెల్యేల చేరిక నేపథ్యంలో ఆయన పైవ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications