శ్రీ గంప మల్లయ్య స్వామి వేడుకల్లో అపశృతి: కొండపై పూజ చేస్తూ లోయలోపడి పూజారి మృతి(వీడియో)
అనంతపురం: జిల్లాలోని శింగనమల మండలంలోని శ్రీ గంప మల్లయ్య స్వామి కొండమీద జరిగిన పూజ కార్యక్రమాల్లో అపశృతి చోటు చేసుకుంది. పూజ చేసే సమయంలో పూజారి అప్పా పాపయ్య కాలు జారి లోయలోపడిపోయాడు. భారీ కొండ మీద నుంచి పడిపోవడంతో పూజారి పాపయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

శ్రీ గంప మల్లయ్య స్వామి ఆలయం వద్ద వేడుకలు
వివరాల్లోకి వెళితే.. శింగనమల మండలం పరిధిలో బాగా ఎత్తైన కొండ ప్రదేశంలో శ్రీ గంప మల్లయ్య స్వామి ఆలయం ఉంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఇక్కడ పూజలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక ప్రతి శనివారం ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు స్వామి దర్శనానికి ఇక్కడికి వస్తారు.
కొండపైన వెలసని స్వామివారిని దర్శించుకునేందుకు కొండలను ఎక్కుతూ భక్తులు తమ భక్తియాత్రను సాహసోపేతంగా కొనసాగిస్తారు. అయితే, స్వామివారికి కొండపై హారితి ఇచ్చే కార్యక్రమం కూడా సాహసోపేతంగానే ఉంటుంది. ఎత్తైన కొండపై నూనె చారలు ఉన్న బండపై నుంచి పూజారి పూనకం వచ్చిన విధంగా హారతి ఇస్తారు. దీన్ని చూసేందుకు భక్తులుచూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

కాలు జారి కిందపడిపోయిన పూజారి
ఆ ప్రాంతమంతా గోవింద నామ స్మరణ మధ్య జరిగే ఈ కార్యక్రమం ఈసారి విషాదంగా మారింది. ఎప్పటిలానే పూజారి అప్పా పాపయ్య హారతి కార్యక్రమం ప్రారంభించారు. అయితే, అంతా హారతి కార్యక్రమాన్ని చూస్తూ వీడియోలు కూడా తీసుకున్నారు. కాగా, ఒక్కసారిగా పూజారి కాలు జారి కిందపడిపోయాడు.
దాదాపు 100 మీ. ఎత్తైన కొండపై నుంచి పడటంతో పూజారి మృతి
దాదాపు 100 మీటర్ల ఎత్తైన కొండపై నుంచి పూజారి కింద పడిపోయారు. క్షణాల్లో జరిగిన ఈ ఘటనతో భక్తులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే కొండ కిందకు దిగి చూడగా పూజారి అప్పటికే మృతి చెందారు. ప్రతియేటా భక్తి పారవశ్యం మధ్య జరిగే ఈ కార్యక్రమం ఈసారి విషాదం నింపడంతో భక్తులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటనను కొందరు తమ ఫోన్లలో వీడియో తీశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. పూజారి మృతితో ఆయన కుటుంబంతోపాటు స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఎపిలగుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు ఉన్న ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆత్మకూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వాసులుగా గుర్తించారు. మదనపల్లి వైపు నుంచి వస్తున్న లారీని విజయవాడవైపు నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతులు మంత్రి ఆళ్ల నాని బంధువులుగా గుర్తించినట్లు తెలిసంది. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications