వైఎస్ పై కాంగ్రెస్ లో అదే డైలమా-పేరు వాడొద్దంటూ జగన్,షర్మిలకు-మరోవైపు ద్రోహి ముద్ర
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా పనిచేసిన దివగంత రాజశేఖర్ రెడ్డిని ఒకప్పుడు ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఆయనపై విమర్శల దాడి మొదలుపెట్టింది. ఒకప్పుడు వైఎస్సార్ పేరు తమకే సొంతమన్న పార్టీ.. ఇప్పుడూ అదే పాట పాడుతోంది. ఓవైపు వైఎస్సార్ కాంగ్రెస్ కు ద్రోహం చేశారంటూనే ఆయన పేరును జగన్, షర్మిల తమ పార్టీలకు వాడుకోవడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. నిన్న షర్మిల పార్టీ ప్రారంభోత్సవంలో విజయమ్మ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.

మళ్లీ తెరపైకి వైఎస్సార్ రగడ
గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన పేరును వాడుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీకీ, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూ మధ్య వివాదాలు నెలకొన్నాయి. వైఎస్ పేరును జగన్ వాడుకునే విషయంలో ఓసారి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, మరోసారి వైఎస్ అవినీతికి పాల్పడ్డారంటూ భిన్నమైన విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ.. మరోసారి వైఎస్ షర్మిల పార్టీ స్ధాపన సందర్భఁగా ఈ వివాదాన్ని తెరపైకి తెస్తోంది.

వైఎస్సార్ పేరు వాడొద్దన్న కాంగ్రెస్
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఆయన కుమారుడు, కుమార్తె తమ పార్టీలకు పెట్టుకోవడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు మొదలుపెట్టింది. వైఎస్సార్ పేరును ప్రతి ఒక్కరూ బ్రాండ్‌గా వాడుకుంటున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. పార్టీలు పెట్టేవాళ్లు రాజశేఖరరెడ్డి పేరు వాడుకోకుండా వాళ్లు ప్రజలకు ఏం చేశారో చెప్పి వస్తే బాగుంటుందని జగన్, షర్మిలను ఉద్దేశించి శైలజానాథ్ వ్యాఖ్యానించారు.

విజయమ్మ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్
నిన్న కాంగ్రెస్ పార్టీ తన భర్త రాజశేఖర్ రెడ్డికి ద్రోహం చేసిందంటూ విజయమ్మ చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి ద్రోహం చేయలేదని, వైఎస్సే కాంగ్రెస్ కు ద్రోహం చేశారని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పుణ్యమాని రాజభవనాలు నిర్మించుకుని, సాక్షి పేపర్ , టీవీ పెట్టుకుని కాంగ్రెస్ ను రోడ్డుపై పడేసింది మీరేనని విజయమ్మకు తులసిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ నేతలు వైఎస్సార్ పై తీవ్ర విమర్శలు చేస్తుంటే ఆయన పిల్లలు పల్లెత్తుమాట అనడం లేదన్నారు. వైఎస్ మరణిస్తే రిలయన్స్ అంబానీ కుట్ర అన్న జగన్.. అధికారంలోకి వచ్చాక ఆయన సిఫార్సు చేసిన పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటిస్తే మీరెందుకు ప్రశ్నించలేదని విజయమ్మను విమర్శించారు.
మీ బిడ్డలపై మీకు ప్రేమ ఉండొచ్చని, కానీ కాంగ్రెస్ ను విమర్శించడం తగదన్నారు. వైఎస్ ఇందిరమ్మ రాజ్యం కోసం కలలు కంటే విజయమ్మ తన బిడ్డల రాజ్యం కోసం కలలు కంటున్నారని తులసిరెడ్డి విమర్శించారు.
Recommended Video

వైఎస్సార్ పై కాంగ్రెస్ లో అదే డైలమా
వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికుండగా ఆయన్ను ముఖ్యమంత్రిగా ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీ.. ఆయన మరణం తర్వాత తొలుత తమ వాడిగా చెప్పుకుంది. కానీ వైఎస్ జగన్ పార్టీ పెట్టి వైఎస్సార్ బ్రాండ్ తో ముందుకెళ్తున్న తరుణంలో తండ్రీ కొడకుల్ని అవినీతిపరులుగా ముద్రలు వేసింది. ఇప్పుడు మరోసారి ఓవైపు వైఎస్సార్ పేడు వాడుకోవద్దంటూనే మరోవైపు వైఎస్ కాంగ్రెస్ కు ద్రోహం చేశారంటూ కొత్త పాట మొదలుపెట్టింది. దీనిపై రాష్ట్రంలో తీవ్ర చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications