30-60 సెకెన్ల నిడివి ఉన్న వీడియోలను షేర్ చేయమని కోరిన ఏపీ ప్రభుత్వం: ఈ హ్యాష్ ట్యాగ్ పై
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ఓ నూతన కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టింది. ఈ నెల 15వ తేదీన దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దీనికి శ్రీకారం చుట్టబోతోంది. ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికల్లో ప్రజలను నేరుగా భాగస్వామ్యులను చేయడం దీని ఉద్దేశం.
ఏపీ పునర్నిర్మాణం, దేశ ప్రగతిలో ప్రతి ఒక్క పౌరుడినీ సమాన భాగస్వామిని చేయడమే లక్ష్యంగా ఆగస్టు 15న చంద్రబాబు దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తును స్వయంగా తీర్చిదిద్దే కీలక బాధ్యతాయుత భాగస్వాములుగా ప్రతి పౌరుడూ మారాలని ఆయన ఆకాంక్షిస్తోన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా మలచాలని భావిస్తోన్నారు. దీనికి సంబంధించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ఈ క్రమంలో ప్రభుత్వం ఓ నూతన క్యాంపెయిన్ కు తెర తీసింది. వికసిత్ భారత్ సాధన దిశగా సాగుతున్న ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరి సృజనాత్మక ఆలోచనలను, దేశాభివృద్ధికి అవసరమైన వ్యూహాలను పంచుకోవడానికి ఇది ఓ వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొంది. ఈ క్యాంపెయిన్‌లో పాల్గొనాలనుకునే ఆసక్తి గలవారు దేశ ప్రగతిపై తమకు ఉన్న విజన్‌ను స్పష్టంగా వివరిస్తూ ఓ ఆకర్షణీయమైన వీడియోను రూపొందించాలి. ఈ వీడియో 30 నుంచి 60 సెకెన్లలోపే ఉండాలి.
అనంతరం ఆ వీడియోను హ్యాష్‌ట్యాగ్‌తో తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. దీని హ్యాష్ ట్యాగ్.. #PartnersInNationBuilding. ఇది మెయిన్ హ్యాష్ ట్యాగ్. దీనితో పాటు #MyIndiaMyVision, #IndependenceDay2026, #AneNenu అనే హ్యాష్ ట్యాగ్ లను కూడా జత చేయవచ్చు. వీటన్నింటినీ కూడా APOfficial News అనే అడ్రస్ కు ట్యాగ్ చేయాలి. దేశాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం.
ఈ వినూత్న ప్రచారం ద్వారా దేశంలోని యువత, నిపుణులు, సామాన్య పౌరులు తమ మనసులోని ప్రణాళికలను నేరుగా పంచుకోవచ్చు. విద్య, వైద్యం, వ్యవసాయం, సాంకేతికత, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన వంటి విభిన్న రంగాలలో దేశం ఏ విధంగా ముందుకు సాగాలో ప్రజలు తమ వినూత్న అభిప్రాయాలను వ్యక్తపరచడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడమే కాకుండా, వారి సలహాలు, సూచనల ద్వారానే నిజమైన దేశ నిర్మాణం సాధ్యమవుతుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.




Click it and Unblock the Notifications