మందుబాబులకు ఏపీ ప్రభుత్వం కొత్త సంవత్సరం కానుక: రెండు రోజులే
Liquor shops: కొత్త సంవత్సరం సందర్బంగా మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అర్ధరాత్రి 12 వరకు మద్యం షాపులు తెరిచి ఉంచడానికి అనుమతి ఇచ్చింది. ఈ రెండు రోజులకు మాత్రమే దీన్ని పరిమితం చేసింది. ఆది, సోమ వారాల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు రాష్ట్రంలోని అన్ని మద్యం షాపుల కార్యకలాపాలు యధాతథంగా కొనసాగుతాయని తెలిపింది.
బార్లు, క్లబ్బులను మూసివేసే గడువును సవరించింది ఏపీ ప్రభుత్వం. అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంట వరకు మద్యం సరఫరా చేసుకునే వెసలుబాటు కల్పించింది. దీనివల్ల ఈ రెండు రోజుల్లో కనీసం 450 కోట్ల రూపాయల మేర అదనపు ఆదాయం అందే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం విక్రయాలకు మంచి డిమాండ్ ఉంటుందనేది తెలిసిన విషయమే. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ జరుపుకొంటుంటారు. మద్యం, మాంసాహారానికి ప్రయారిటీ ఇస్తారు. మద్యం అమ్మకాలు రెట్టింపవుతుంటాయి.
దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం షాపులు...అర్ధరాత్రి దాకా తెరచి ఉంచడానికి ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇవే తరహా ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల పని వేళల సమయాన్ని సవరించింది.
అర్ధరాత్రి 12 వరకు మద్యం దుకాణాలు తెరచి ఉంచడానికి తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు అనుమతులు ఇచ్చారు. బార్లు, క్లబ్బుల్లో మద్యం సరఫరా చేయడానికి అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంట వరకు వీలు కల్పించింది. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని రెండు తెలుగు రాష్ట్రాల పోలీసు యంత్రాంగాలు ఆదేశాలు జారీ చేశాయి.












Click it and Unblock the Notifications