'యాప్': ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయం కోసం, హైటెక్ బాబు తీరిది
అమరావతి: ప్రభుత్వ పనితీరును నేరుగా ప్రజల నుండి తెలుసుకొనేందుకుగాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు' కనెక్ట్ ఏపీ సీఎం' అనే యాప్ ను చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్ళు అవుతోంది.అయితే ఈ మూడేళ్ళ కాలంలో ప్రభుత్వం చేపట్టిన పథకాలు ప్రజలకు ఏ మేరక ఉపయోగపడుతున్నాయనే విషయాన్ని తెలుసుకోవాలని బాబు భావిస్తున్నారు.
ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి. ప్రభుత్వ పనితీరును ఏ రకంగా మెరుగు పర్చుకోవాలనే విషయమై బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతే కాదు ప్రజల నుండి వచ్చే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని పథకాల్లో మార్పులు చేర్పులు చేయాలని బాబు తలపెట్టారు.
మరో వైపు వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఏ రకమైన హమీలను ఇవ్వాలి, ఇప్పటివరకు ఇచ్చిన హమీలు ఏ మేరకు ఉపయోగపడుతున్నాయనే విషయాలపై చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నారు.

'కనెక్ట్ ఏపీ సిఎం యాప్' కు శ్రీకారం చుట్టనున్న బాబు
ప్రభుత్వ శాఖల పనితీరుకు ప్రజలే మార్కులు వేయవచ్చు. సమస్యలను వివరించే అవకాశం కూడ ఉంది. ప్రభుత్వ పనితీరును మెరుగుపర్చుకొనేందుకుగాను కనెక్ట్ ఏపీ సిఎం అనే యాప్ ను ప్రారంభించాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. ప్రజల సమస్యలను నేరుగా ఈ యాప్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించే అవకాశం ఉంది.ఫిర్యాదులను కూడ నేరుగా ఈ యాప్ ద్వారా అందించే వెసులుబాటు కల్పించనున్నారు.

మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసిన యాప్
కనెక్ట్ ఏపీ సిఎం అనే ఈ యాప్ ను మైక్రోసాప్ట్ సంస్థ అభివృద్ది చేసింది.కైజాలా యాప్ ను దీని కోసం తొలుత డౌన్ లోడ్ చేసుకోవాలి. కైజాలా యాప్ ను ఓపెన్ చేయగానే కనెక్ట్ ఏపీ సిఎం అనే ఐకాన్ కన్పిస్తోంది.దానిపై ఒక్కసారి క్లిక్ చేసి కనెక్ట్ అయితే చాలు..ప్రభుత్వం వివిద అంశాలపై చేసే ప్రజాభిప్రాయ సేకరణల్లో భాగస్వామ్యులు కావొచ్చు.అయితే ఈ యాప్ కు కనెక్ట్ అయినవారికీ డీఫాల్ట్ గా ప్రభుత్వ పనితీరు ఎలా ఉందనే ప్రశ్న వస్తోంది.

ప్రభుత్వ శాఖల పనితీరుపై ప్రజల అభిప్రాయాలు
ప్రజల నుండి ప్రభుత్వ శాఖల పనితీరును ముఖ్యమంత్రి నేరుగా తెలుసుకొంటారు.ఈ యాప్ ద్వారా క్షేత్రస్థాయిలోని సమస్యలను నేరుగా తెలుసుకొనే అవకాశం ఏర్పడనుంది.ప్రభుత్వ శాఖల సమీక్షకు ముందురోజే ఆయా శాఖల పనితీరుపై బాబు ఈ యాప్ ద్వారా వచ్చిన పీడ్ బ్యాక్ ను తీసుకొంటారు. ప్రజలు ఏ రకంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారో తన సమీక్షలో ఈ యాప్ ద్వారా వచ్చిన సమాచారాన్ని వెల్లడిస్తారు.

సూచనలను కూడ తీసుకోనున్న ప్రభుత్వం
ప్రభుత్వ పనితీరు ఎలా ఉందనే విషయాన్ని ప్రధానంగా తెలుసుకోవడంతో పాటు ఇంకా ప్రజలు ఏం కోరుకొంటున్నారనే విషయాన్ని కూడ తెలుసుకోనున్నారు.ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది, ఫర్వాలేదు, బాగాలేదు, అన్న ఆఫ్షన్లు వస్తాయి. ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పవచ్చు. ప్రభుత్వ శాఖల పనితీరుపై కూడ జిల్లాల వారీగా ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, సమస్యలను నేరుగా తెలుసుకొనే అవకాశం నెలకొంది. అంతేకాదు ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు చెప్పేందుకు వీలుగా ఓ బాక్స్ ను ఏర్పాటు చేశారు. ఈ బాక్స్ లో ప్రజలు నేరుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకొనే అవకాశం ఉంది.

హైటెక్ పద్దతులు
హైటెక్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు పేరు తెచ్చుకొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైటెక్ సిఎంగా పేరుపొందారు.అయితే హైటెక్ లక్ష్యంగా చేసుకొని వ్యవసాయాన్ని , ఇతర పద్దతులను మర్చిపోయారని ఆనాడు విపక్షాలు ఆయనను విమర్శించారు.అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడ ఆయన అదే హైటెక్ పద్దతులను ఉపయోగిస్తున్నారు. పేపర్ లెస్ బడ్జెట్ ను , పేపర్ లెస్ క్యాబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో బాబు ముందుంటారని పార్టీ నాయకులు గుర్తుచేస్తున్నారు.












Click it and Unblock the Notifications