జగన్ కేబినెట్‌లో ట్రబుల్ షూటర్: ఆన్‌లైన్ సినిమా టికెట్ల గొడవ: ఆ మంత్రికి కీలక శాఖ అప్పగింత
అమరావతి: రాష్ట్రంలో ఆన్‌లైన్ ద్వారా సినిమా టికెట్ల విక్రయానికి సంబంధించిన వివాదం పతాక స్థాయికి చేరుకుంటోంది. ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా సినిమా టికెట్ల విక్రయాన్ని అందుబాటులోకి తీసుకుని వస్తూ జారీ చేసిన జీవో నంబర్ 35ను ఏపీ హైకోర్టు కొట్టేసిన తరువాత.. ఈ వివాదం మరింత ముదిరినట్టే కనిపిస్తోంది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జగన్ సర్కార్ అప్పీల్‌కు వెళ్లింది. దీనిపై తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది న్యాయస్థానం.

సినిమాటోగ్రఫీ శాఖ కూడా..
ఈ పరిస్థితుల మధ్య జగన్ సర్కార్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సినిమాటోగ్రఫీ శాఖను మంత్రి పేర్నినానికి అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ.. కొద్దిసేపటి కిందటే నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఏపీ ప్రభుత్వ బిజినెస్ రూల్స్‌లోని ఆర్టికల్ 166, క్లాజ్ (3), రూల్ 6, సబ్ రూల్ (1) కింద ఈ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. సినిమాటోగ్రఫీ శాఖను మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)కి కేటాయించినట్లు వివరించారు.

రవాణా, సమాచార శాఖలు..
ప్రస్తుతం పేర్నినాని ఆధీనంలో రెండు కీలక శాఖలు ఉన్నాయి. ఒకటి రవాణా..రెండు సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ. ఈ రెండింటినీ ఆయన పర్యవేక్షిస్తోన్నారు. దీనికి అదనంగా కొత్తగా సినిమాటోగ్రఫీ శాఖ వచ్చి చేరింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని మంత్రివర్గంలో ట్రబుల్ షూటర్‌గా పేర్ని నానికి పేరు ఉంది. కొన్ని కీలక, వివాదాస్పద, సున్నిత అంశాలను ఆయన సునాయాసంగా పరిష్కరించగలిగారనే గుర్తింపు ఉంది.

పేదలపై భారం పడకుండా..
అందుకే- ఆన్‌లైన్ సినిమా టికెట్ల వ్యవస్థ మీద తలెత్తిన వివాదాలను కూడా పరిష్కరించే బాధ్యతను వైఎస్ జగన్.. పేర్నినానికే అప్పగించినట్టయింది. నిజానికి- పేర్నినాని పర్యవేక్షణలోనే ఈ ఆన్‌లైన్ సినిమా టికెట్ల వ్యవస్థ అనేది తెరమీదికి వచ్చింది. ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా.. ఒకే టికెట్ విధానాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. గ్రామీణ స్థాయిలో పేదవాడిపై ఎలాంటి అదనపు భారాన్ని పడకుండా టికెట్ల రేట్లను నిర్దారించింది.

జీవోను కొట్టేసిన నేపథ్యంలో..
నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తమ ఇష్టానుసారంగా టికెట్ల రేట్లను నిర్ధారించుకోవడానికి చెక్ పెట్టింది. దీనితో పాటు- బెనిఫిట్ షోలను ప్రదర్శించే అవకాశం లేకుండా చేసింది. దీన్ని ఎదుర్కొన్న మొట్టమొదటి భారీ బడ్జెట్ మూవీ అఖండ. అఖండ సినిమా బెనిఫిట్ షోను ప్రదర్శించిన థియేటర్లపైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు జీవో నంబర్ 35ను విడుదల చేసింది. ఈ జీవోపై కొందరు ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. ఈ జీవోను కొట్టివేసింది.

ఈ బాధ్యత కూడా పేర్నినానికే.
ఈ పరిస్థితుల మధ్య మరింత క్లిష్టంగా తయారైన ఈ అంశాన్ని సామరస్యంగా పరిష్కరించే బాధ్యతను జగన్ సర్కార్.. పేర్నినానికే అప్పగించినట్టయింది. సినిమాటోగ్రఫీ శాఖ పరిధిలోకే వస్తాయి.. ఆయా అంశాలన్నీ. ఇదివరకు టికెట్ల విషయంలో గానీ, ఇతరత్రా ఫిల్మ్ ఇండస్ట్రీతో ముడిపడి ఉన్న అంశాలన్నింటీని పేర్ని నాని పర్యవేక్షించారు. చిరంజీవి, దిల్ రాజు వంటి హీరోలు, నిర్మాతలు కూడా ఆయనతో భేటీ అయ్యారు. ఒత్తిళ్లకు తలొగ్గకుండా.. ఆన్‌లైన్ ద్వారా సినిమా టికెట్లను జారీ చేసే వ్యవస్థకు రూపకల్పన చేశారు.












Click it and Unblock the Notifications