బంగాళాఖాతంలో ద్రోణి- ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు, ఈదురుగాలులు
ఏపీలో భిన్న వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల ఎండ తీవ్రత అధికంగా ఉంటోండగా.. మరికొన్ని చోట్ల అడపాదడపా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తోన్నాయి. ఎండ వేడి నుంచి కొంతమేర ఉపశమనాన్ని కల్పిస్తోన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం వల్ల ఈ తరహా వాతావరణం ఏర్పడినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
నేడు కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గి ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వాతావరణం కొంత చల్లగా మారుతుందని, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

ఇప్పటికే పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. అక్కడక్కడ ఈదురుగాలులు సైతం బీభత్సాన్ని సృష్టించాయి. ట్రోపోస్ఫియర్ లో వీస్తోన్న గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడ్డాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. ప్రత్యేకించి పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కడప, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి.
పలుచోట్ల గంటకు 50-60 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచాయి. నేడు ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకూ ఇదే పరిస్థి ఉండొచ్చు. అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడొచ్చు. పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలకు అవకాశాలు లేకపోలేదు. మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు చెట్ల కింద, పొలాల్లో ఉండకూడదని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు. పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడరాదని కోరారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మరోవైపు ఎండ తీవ్రత కూడా గరిష్ట స్థాయిలో నమోదవుతోంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత రికార్డయింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.












Click it and Unblock the Notifications