తెలంగాణ మంత్రి పొంగులేటికి గట్టి షాక్ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం
కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో సమావేశమయ్యారు. అభివృద్ధి విషయంలో రెండు రాష్ట్రాలు సమన్వయం చేసుకొని ముందుకు సాగుదామని నిర్ణయించుకున్నాయి. అయితే అభివృద్ధికి అడ్డుపడే విధంగా గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఉంటే వాటిని వెంటనే సమీక్షించి కఠిన నిర్ణయాలు తీసుకోవడం మాత్రం జరుగుతుందని చంద్రబాబు ప్రభుత్వం నిరూపించింది. ఏపీలో వైఎస్ జగన్ హయాంలో విశాఖపట్నంలో భూగర్భ విద్యుత్తు లైన్ల పనుల కోసం ప్రస్తుత తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్స్ రూ.1194 కోట్ల విలువ చేసే పనులు దక్కించుకుంది.
గతంలో కూడా నోటీసులు
పనులు దక్కించుకొని అధిక సమయం గడుస్తున్నప్పటికీ పనులు మొదలుపెట్టకపోవడంపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతవరకు పనులు ఎందుకు మొదలుపెట్టలేదో చెప్పాలని ఈపీడీసీఎల్ నోటీసులు జారీచేసింది. పనులు ప్రారంభించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. పనులు దక్కించుకున్నవారు ఏ స్థాయిలో ఉన్నా, ఏ ముఖ్యమంత్రులకు దగ్గరైనా.. అటువంటి విషయాల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేసినట్లైంది. గతంలో కూడా ఈ కంపెనీకి నోటీసులు పంపించినప్పటికీ ఇంతవరకు స్పందించకపోవడంతో మరోసారి నోటీసులు పంపించారు.

అంచనాలను పెంచి
ఏ పనులు మొదలుపెట్టాలన్నా సమర్థవంతమైన కంపెనీలను ఎంపిక చేసేందుకు టెండర్లు పిలిచి ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తోంది. విశాఖలో భూగర్భ విద్యుత్తు లైన్ల విషయంలో అంచనాలు పెంచారనే ఆరోపణలున్నాయి. రూ.1194 కోట్లు ప్రధాన యూనిట్ పనులకు, అదనంగా రూ.314 కోట్ల పనులకు వేర్వేరుగా టెండర్లు పిలిచారు. మొదటిసారి పిలిచిన టెండర్లకంటే రూ.343 కోట్లు అదనంగా పెంచారు. దీంతో రాఘవ కన్ స్ట్రక్షన్స్ పది శాతం అదనంగా కోట్ చేసి పనులు దక్కించుకుంది. మంత్రి పొంగులేటి కంపెనీ రూ.1285.94 కోట్లు ఈపీడీసీఎల్ కు చెల్లించాలి. టెండరు ధరకన్నా రూ.91.94 కోట్లు ఎక్కువ. ప్రధాన యూనిట్ పనులకు కేటాయించిన రూ.314 కోట్లు కలిపితే మొత్తం రూ.1599.94 కోట్లు అవుతుంది. 2022 డిసెంబరులో పిలిచిన టెండర్లలో ప్రాజెక్టు విలువ 37.33 శాతం పెరిగింది. అయినప్పటికీ రాఘవ కంపెనీ పనులు మొదలుపెట్టలేదు. ఈ విషయంలో ఈపీడీసీఎల్ ఆగ్రహంగా ఉంది.












Click it and Unblock the Notifications