ఏపీలో రైతులకు చంద్రబాబు భారీ శుభవార్త.. వారికి రూ.లక్ష
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండుసార్లు, విభజిత ఏపీకి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు నారా చంద్రబాబునాయుడు. గతంలో ఆయన కేవలం అభివృద్ధికే పెద్దపీట వేసేవారు. అయితే ప్రస్తుతం మాత్రం అభివృద్ధితోపాటు సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తున్నారు. రెండింటినీ సమాంతరంగా అమలు చేస్తానని ప్రకటించారు. దీనికి తగినట్లుగా జూన్ నాలుగోతేదీన కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వస్తున్నారు.
అప్పటి నిబంధనే అమలు
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం రైతులకు రూపాయి ఖర్చులేకుండా వంద శాతం రాయితీని ఇస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ సూక్ష్మ సాగునీటి పథకానికి పెద్దపీట వేస్తుంది. ఈసారికూడా ఆ దిశగానే పయనిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరాంతానికి ఉమ్మడి అనంతపురం జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ సాగుకు 67,500 హెక్టార్ల లక్ష్యాన్ని నిర్ధేశించింది. 2015-16లో అప్పటి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పాత నిబంధనలనే అమలు చేయనున్నారు. అవే రాయితీలను కొనసాగించనున్నారు. రైతులు తమ పేర్లను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

79,105 హెక్టార్లలో పరికరాలు కావాలని కోరిన రైతులు
అనంతపురం జిల్లాలో 37,500 హెక్టార్లు, శ్రీసత్యసాయి జిల్లాలో 30వేల హెక్టార్లలో సూక్ష్మ సాగునీటి సేద్యాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు అవసరమైన పరికరాలను అప్పగించే బాధ్యతను 26 కంపెనీలకు అప్పజెప్పారు. ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో రైతులు తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. 79,105 హెక్టార్లలో పంట సాగుచేసేందుకు పరికరాలు కావాలని రైతులు కోరుతున్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఐదెకరాల వరకు రూ.లక్ష రాయితీ, ఐదు నుంచి 10 ఎకరాల వరకు 90 శాతం రాయితీ, పది ఎకరాల పైబడినవారికి 50 శాతం రాయితీపై రూ.2 లక్షల చొప్పున ఇస్తారు. సేద్యానికి సంబంధించిన పరికరాలకు సంబంధించి ఐదెకరాల్లోపు 55 శాతం, 12.50 ఎకరాల్లోపు 45 శాతం రాయితీని ప్రభుత్వం అన్నదాతలకు అందజేస్తోంది. త్వరలోనే పరికరాలను అందించనున్నారు.












Click it and Unblock the Notifications