ఏపీ చరిత్రలో తొలిసారి: ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై ఆర్డినెన్స్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై ఆర్డినెన్స్ జారీ చేసింది. మంత్రుల నుంచి ఆన్‌లైన్‌లో ఆర్డినెన్స్‌కు ఆమోదం తీసుకుంది. ఆ తర్వాత గవర్నర్ ఆమోదం కోసం ఆర్డినెన్స్‌ను పంపింది. కాగా, గత ప్రభుత్వం పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పరిమితి బుధవారంతో ముగియనుంది.
ఈ నేపథ్యంలో నాలుగు నెలల కాలానికి టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ప్రభుత్వం ఆమోదం తీసుకుంది. సుమారు రూ. 1.30 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ జారీ చేసింది. 40 విభాగాలకు చెందిన డిమాండ్లు, గ్రాంట్లకు ఆమోదం లభించేలా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూపొందించింది.

అన్నా క్యాంటీన్ల నిర్మాణం, రహదారుల మరమ్మతులు సహా కొన్ని అత్యవసర విభాగాలకు బడ్జెట్ కేటాయింపులు చేసింది. రోడ్ల మరమ్మతులకు రూ. 1100 కోట్ల మేర ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరికొన్ని కీలకమైన కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ కు నిధులు కేటాయించినట్లు తెలిసింది.
కాగా, ఏపీ చరిత్రలోనే ఒకే ఏడాదిలో రెండు సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చేందుకు మరో రెండు నెలల సమయం పడుతుందని ప్రభుత్వం భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, 2024 సెప్టెంబర్ నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఇది ఇలావుండగా, దళితులకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సాంఘిక సంక్షేమ శాఖను ఆదేశించారు. సచివాలయంలో ఆ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆర్థికంగా అత్యంత వెనుకబాటులో ఉండే దళిత వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.












Click it and Unblock the Notifications