ఏపీలో బ్లాక్ వీక్: సగం కరోనా కేసులు వారం రోజుల్లోనే నమోదు: ఆ రెండు జిల్లాల్లో తగ్గుముఖం పట్టినా..
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ విధ్వంసాన్ని సృష్టిస్తోంది. విలయతాండవం చేస్తోంది. ఆరంభంలో పరిమితంగా నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం కట్టుతప్పినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ముందుజాగ్రత్తలను తీసుకుంటున్నప్పటికీ.. కరోనా వైరస్ అదుపులోకి రావట్లేదు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఒకవంక తెలంగాణలో తగ్గుముఖం పట్టగా..అదే సమయంలో ఏపీలో భారీగా నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది.

వారం రోజుల్లో 450 కేసులు..
సరిగ్గా వారం రోజులు. ఈ నెల 20వ తేదీ నుంచి ఆదివారం నాటికి రాష్ట్రంలో 450 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా మొత్తంగా 1097 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇందులో దాదాపు సగం వరకు కిందటి వారం రోజుల్లోనే వెలుగులోకి రావడం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు, కరోనా వైరస్ విలయానికి, దాని తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చిన తరువాత ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే తొలిసారి.

వారం రోజుల్లో వరుసగా..
ఈ వారంరోజుల్లో వరుసగా 75, 35, 56, 80, 62, 61, 81 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ స్థాయిలో ఇదివరకెప్పుడూ పాజిటివ్ కేసులు వెలుగు చూడలేదు. 19 రోజుల రెండోదశ లాక్‌డౌన్ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఈ స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదు కావడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రస్థాయిలో ఏ రోజు కూడా కేసులు తగ్గుముఖం పట్టకపోవడం ప్రభుత్వ పెద్దల్లో కలవరపాటు మొదలైంది.

ఆ రెండు జిల్లాల్లో తగ్గినా..
ఇప్పటిదాకా అత్యధిక కేసులు నమోదవుతూ వచ్చిన కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. 24 గంటల వ్యవధిలో ఈ రెండు జిల్లాల్లో నమోదైన కేసుల సంఖ్య ఏడు మాత్రమే. కర్నూలులో నాలుగు, గుంటూరులో మూడు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 52, పశ్చిమ గోదావరి జిల్లాలో 12 కేసులు నమోదు అయ్యాయి. దీనితో 24 గంటల్లో వెలుగులోకి వచ్చిన మొత్తం కేసుల సంఖ్య 81కి చేరుకుంది.

అయినా టాప్‌లోనే కర్నూలు జిల్లా..
కర్నూలు జిల్లాలో కొత్తగా కేవలం నాలుగు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. అయినప్పటికీ.. ఈ జిల్లా టాప్ పొజీషన్‌లో కొనసాగుతోంది. ఇప్పటిదాకా ఈ జిల్లాలో నమోదైన కేసుల సంఖ్య 279. యాక్టివ్‌గా ఉన్న కేసులు 239 కాగా.. 31 మంది పేషెంట్లు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. తొమ్మిది మంది మరణించారు. గుంటూరు జిల్లాలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు మూడే. దీనితో ఈ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 214కు చేరుకోగా.. యాక్టివ్‌గా ఉన్నవి 177. 29 మంది డిశ్చార్జి అయ్యారు. ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు.












Click it and Unblock the Notifications