కారు కొనేందుకు ప్రభుత్వం నుంచి లోన్ తీసుకున్న ఏపీ మంత్రి
ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసిన రాజన్నదొరపై 13,733 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి నిబద్ధతగా ఉండటంతో ఆమెకు చంద్రబాబు మంత్రి పదవిని కేటాయించారు. ఎటువంటి ఆడంబరాలకు వెళ్లకుండా ఎంతో సింపుల్ గా తన జీవితాన్ని కొనసాగిస్తుంటారు. మంత్రి అయిన తర్వాత సొంతంగా కారు కొనుగోలు చేయాలని మంత్రి భావించారు.
30 వాయిదాల్లో చెల్లించేలా
దీనికోసం ప్రభుత్వం నుంచి రుణం తీసుకున్నారు. మంత్రులు ప్రభుత్వం నుంచి రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. వారు అవసరమైనంత తీసుకుంటే వారి వేతనం నుంచి ప్రతి నెలా మినహాయిస్తారు. కారు కొనుగోలుకు సంధ్యారాణికి ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల రుణం మంజూరైంది. ఆమె వేతనం నుంచి 30 వాయిదాల్లో దీన్ని మినహాయించుకుంటారు. మంత్రి అయివుండి ప్రభుత్వం నుంచి రుణం తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ ద్వారా సంధ్యారాణి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1999లో ఆమె రాజకీయరంగ ప్రవేశం జరిగింది. ఆ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో సాలూరు నుంచి పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. అనంతరం 2006 వరకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా కొనసాగారు.

రాజన్నదొరపై విజయంతో మంత్రి పదవి
ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలిగా 2007 నుంచి 2009 వరకు పనిచేశారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2009లో జరిగిన ఎన్నికల్లో సాలూరు నుంచి టీడీపీ తరఫున పోటీచేసి రాజన్నదొర చేతిలో ఓటమిపాలయ్యారు. 2014లో అరకు నుంచి టీడీపీ ఎంపీగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2024 ఎన్నికల్లో రాజన్నదొరపై విజయం సాధించి మంత్రి పదవిని చేపట్టారు. మధ్యలో 2015 నుంచి 2021 వరకు టీడీపీ ఎమ్మెల్సీగా వ్యవహరించారు. క్యాబినెట్ భేటీలో వరద సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు నిర్వహించిన విధి నిర్వహణకు మంత్రివర్గ సభ్యులంతా లేచి నిలబడి చప్పట్లతో అభినందనలు తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చంద్రబాబుకు కరచాలనం చేసి అభినందించారు.












Click it and Unblock the Notifications