ఆంధ్రప్రదేశ్‌ను అప్రమత్తం చేసిన వాతావరణశాఖ
బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు గోదావరి లోతట్టు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఇప్పటికీ అక్కడ వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నిలిచిపోయిన విద్యుత్తును పునరుద్ధరిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద నీరు పోటెత్తడంతో శ్రీశైలం ప్రాజెక్టులో గేట్లను తెరిచి నీటిని విడుదల చేశారు. ఆగస్టు మొదటివారంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
బలమైన ఈదురు గాలులు
ఉత్తర చత్తీస్ గడ్ పై ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. సముద్ర మట్టం నుంచి దక్షిణం వైపు ఉండటంతో ఏపీలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. యానాం, ఉత్తర కోస్తా జిల్లాల్లో మూడురోజులపాటు తేలికపాటి జల్లులు పడతాయని, గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు.

ఒక్కరోజు వ్యవధిలో 9 టీఎంసీల నీరు
వరద నీరు భారీగా చేరుతుండటంతో ధవళేశ్వరం వద్ద ఉన్న కాటన్ బ్యారేజ్ పై రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక, భద్రాచలంలో మూడో ప్రమాద నెంబరు హెచ్చరిక జారీచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వరదలవల్ల నష్టపోయిన ఒక్కో కుటుంబానికి రూ.3వేల చొప్పున పరిహారం అందజేస్తోంది. రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాస్, కందుల దుర్గేష్ గోదావరి జిల్లాల్లో పర్యటించి వరదవల్ల దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. మరో విపత్తు ఏర్పడితే ఆదుకోవడానికి నాలుగు సహాయక బృందాలను విపత్తుల నిర్వహణ సంస్థ సిద్ధంగా ఉంచింది. మరోవైపు నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వదర నీరు చేరుతోంది. మంగళవారం సాయంత్రానికి 144 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉంది. ఒక్కరోజు వ్యవధిలోనే దాదాపు తొమ్మిది టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరింది.












Click it and Unblock the Notifications