పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్య, నా వల్ల కాదని జగన్: బంద్ (ఫోటోలు)
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను నెరవేర్చాలని వైసిపి, కాంగ్రెస్, వామపక్షాల పిలుపు మేరకు శనివారం నిర్వహించిన బంద్ ఒకటి రెండుచోట్ల మినహా ప్రశాంతంగా జరిగింది. వివిధ ప్రాంతాల్లో ధర్నాలు, ప్రదర్శనలు, రాస్తారోకోలు కొనసాగాయి.
చాలాచోట్ల విద్యా సంస్థలు, పాఠశాలలు, దుకాణాలు మూశారు. కొన్ని చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు కూడా పని చేయలేదు. బస్సులు తిరిగాయి. పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు తెరచి ఉన్నాయి. రోడ్లపైకి వచ్చిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
వైసిపి ఆధ్వర్యంలో బెంజ్ సర్కిల్‌లో కొంతసేపు ధర్నా నిర్వహించారు. రాఘవయ్య పార్కు వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పీఎన్‌బీ బస్టాండు వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో బస్సులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ వారధి వద్ద రాస్తారోకో చేశారు. వారిని అరెస్ట్ చేశారు.
కాగా, బంద్ పైన పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బందులతో తెలుగు రాష్ట్రాలు నలిగిపోయాయన్నారు. ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలో నా ప్రణాళిక, నా ఆలోచనలు నాకున్నాయని పవన్ చెప్పారు.
మరోవైపు, వైసిపి అధినేత జగన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో హోదా పోరు చేస్తామని అన్నారు. రాదనుకున్న తెలంగాణను కేసీఆర్ సాధించారని, ఇప్పుడు పోరాటం ఆపేస్తే ఇక హోదా రాదన్నారు. తన ఒక్కడితో కాదని, అందరి మద్దతు కావాలన్నారు. హోదా ఇచ్చే వారికే 2019 ఎన్నికల్లో ఓటేద్దామన్నారు.

ఏపీ బంద్
గుంటూరు జిల్లాలో నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. విశాఖపట్నంలో ఉదయమే మద్దిలపాలెం వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి విపక్ష నేతలు రాస్తారోకో చేయాలని నిర్ణయించుకున్నారు. పోలీసులు భారీ సంఖ్యలో కూడలి వద్దకు చేరుకుని ఆందోళనకారులను అరెస్టు చేశారు. వీరితో పాటు నగరంలో మొత్తం వందలమందిని అరెస్టు చేశారు.

దిష్టిబొమ్మల దగ్ధం
ఏపీలోని పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలతో పాటు వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి. తిరుపతిలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్య, ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మలను సీపీఎం నాయకులు దహనం చేశారు.

భూమన అరెస్ట్
వైసిపి నాయకుడు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురంలలో నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

కాకినాడలో..
కాకినాడలో వైసిపి ఆధ్వర్యంలో కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. రాజమహేంద్రవరంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు బంద్‌కు మద్దతు తెలిపారు. జాతీయ రహదారి పైన బైఠాయించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడలో వామపక్షాలు రాస్తారోకో నిర్వహించాయి.

ఏలూరులో..
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన ప్రదర్శనలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పాల్గొన్నారు. ఏలూరు అగ్నిమాపక కూడలిలో రోడ్డుపై బైఠాయించారు. పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజును పోలీసులు అరెస్టు చేసి విడుదల చేశారు.

కర్నూలులో..
కర్నూలులో ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి నేతృత్వంలో జాతీయరహదారిపై రాస్తారోకో చేశారు. రఘువీరాను అరెస్టు చేసి విడుదల చేశారు. వైసిపి ఆధ్వర్యంలో కర్నూలులో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా నిర్వహించారు.

కడపలో నిలిచిన బస్సులు
కడప జిల్లాలో పలు డిపోల వద్ద ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. రాయచోటి, కడప, రాజంపేట ప్రధాన రహదారుల వద్ద ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించారు. కడప ఐటీఐ కూడలిలో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. డ్రోన్లతో పోలీసులు భద్రతను పర్యవేక్షించారు.

అనంతపురంలో...
అనంతపురంలో మాజీ ఎంపీ వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లాలో బస్సుల రాకపోకలు యథావిధిగా నడిచాయి. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. విజయనగరం జిల్లాలో తెల్లవారుజామునుంచే బస్టాండ్ల వద్ద నిరసనకు దిగిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications