rain lashes in ap: ఏపీలో వర్ష బీభత్సం.. 4 రోజులుగా వర్షాలు, నెల్లూరు, చిత్తూరు
సీజన్ ముగిసిన తర్వాత కూడా వర్షాలు ఆగడం లేదు. అవును తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వర్షంతో నెల్లూరు నీట మునిగింది. గత నాలుగు రోజులుగా కుండపోత వర్షం కురుస్తుండడంతో జనజీవనం స్తంభించిపోయింది. వర్ష బీభత్సంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నెల్లూరు టౌన్‌లోకి నీరు చేరడంతో.. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరిపోయింది. ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు, వస్తువులు తడిసిపోవడంతో..ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

మంత్రి పర్యటన
విషయం తెలుసుకున్న మంత్రి అనీల్ కుమార్ వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రహదారులపై మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోవడంతో వాహనాలు నిలిచిపోయాయి. నీళ్లు నిలవకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా. 24.01 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాపోరు మండలంలో 78.2 మిల్లీమీటర్లు, కనిగిరిలో 70.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వ్యవసాయ పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.

5 రోజులు
ఐదు రోజులు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తీర ప్రాంతాల్లో మత్స్యకారులు ఈనెల 13 వరకు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. రాబోయే మూడు రోజుల్లో అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు.

ఉపరితల ఆవర్తనం
సముద్రమట్టానికి 8.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని, దీని వల్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 09వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని, క్రమేపి బలపడి వాయువ్య దిశగా పయనిస్తుందని తెలిపారు. 11, 12వ తేదీల్లో దక్షిణ కోస్తాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారడంతో కోస్తా తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు.

తిరుపతిలో..
తిరుపతిలో కూడా సేమ్ ఇదే పరిస్థితి నెలకొంది. నగరంలోని ప్రతి కూడలి చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి వర్షం కురుస్తోంది. వాహనాలను నీట మునిగిపోయాయి. తిరుమలకు వెళ్లే దారిలో నీట నిలవడంతో..శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. లక్ష్మీపురం సర్కిల్‌లో కాల్వలు పొంగి ప్రవహిస్తుండడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి.

నవ వధువు మృత్యువాత
భారీ వర్షానికి నవ వధువు మృత్యువాత పడిందని తెలుస్తోంది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి ఉన్న ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ నెల 9, 10వ తేదీల్లో తమిళనాడులో 10, 11, 12 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్రలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ నెల 9వ తేదీ లోపు తీరప్రాంతాలకు చేరుకోవాలని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications