ఏపీని తుస్సుమనిపించిన నైరుతి- 17% లోటు వర్షాలు: దెబ్బకొట్టిన జిల్లాలు
Bay of Bengal: ఎన్నో ఆశలతో ఊరించిన నైరుతి రుతుపవనాలు ఏపీని తీవ్రంగా నిరాశపరిచాయి. ఈ సంవత్సరం ముందుగానే రాష్ట్రంలో ప్రవేశించినప్పటికీ- ఆ తరువాత దెబ్బకొట్టాయి. వాటి కదలికలు మందగించాయి. బ్రేక్ తీసుకున్నాయి. దీని ప్రభావం ఏపీలో సగటు వర్షపాతం తీవ్రంగా పడింది. ఎన్నడూ లేనివిధంగా 17 శాతం మేర లోటు వర్షపాతం రికార్డయింది.
దీనికి సంబంధించిన అధికారిక గణాంకాలను ఏపీ అగ్రికల్చర్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ సిస్టమ్ అండ్ నెట్ వర్కింగ్ వెల్లడించింది. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ మొత్తం ఆధారపడేది నైరుతి రుతుపవనాల మీదే. ఈ ఏడాది మే 24వ తేదీన రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకాయి. అదే నెల 26వ తేదీన రాష్ట్రంలో ప్రవేశించాయి.

ఆ తరువాతే వాటి కదలికలు మందగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీజన్ సాధారణ వర్షపాతం 547.7 మిల్లీ మీటర్లు. ఈ నెల 2వ తేదీ నాటికి రికార్డు కావాల్సిన సగటు వర్షపాతం 103.5 మిల్లీ మీటర్లు. ఈ ఏడాది అదే తేదీ నాటికి నమోదైన వర్షపాతం 85.5 మిల్లీ మీటర్లే. అంటే 17.4 శాతం లోటు కనిపించింది ఇందులో.
- జూన్ 1 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు తొమ్మిది జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 20 నుంచి 59 శాతం మేర లోటు వర్షపాతం రికార్డయింది.
- విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
- అత్యధిక లోటు వర్షపాతం నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో రికార్డయింది. ఇక్కడ 60 నుంచి 99 శాతం మేర లోటు వర్షపాతం కనిపించింది.
- ఏలూరు జిల్లాలో సగటు కంటే 60 శాతం అధిక వర్షపాతం నమోదైంది.
- తూర్పు గోదావరి జిల్లాలో సాధారణం కంటే 20 నుంచి 59 శాతం మేర అధిక వర్షం కురిసింది.












Click it and Unblock the Notifications