ఉజ్జయిని మహంకాళి ఆలయంలో సీఎం రేవంత్- సీపీ సజ్జనార్ కీలక సూచనలు..!!
చారిత్రక ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆషాఢ మాసం బోనాల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి తొలిబోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సీఎం రేవంత్ సహా పలువురు ప్రముఖులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు బోనాలు సమర్పించారు. బోనాల వేళ భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేసారు.
ముఖ్యమంత్రి రేవంత్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అమ్మవారికి తొలి బోనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించారు. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీపీ సజ్జనార్ దంపతులు ఈరోజు (ఆదివారం) అమ్మవారిని దర్శించుకున్నారు. సజ్జనార్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నానని తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఆషాఢ బోనాలకు ఎంతో ఘనమైన చారిత్రక నేపథ్యం ఉందని చెప్పుకొచ్చారు.

తరలి వచ్చిన ప్రముఖులు
కాగా, ప్రస్తుతం నగరవ్యాప్తంగా ఉత్సవాలు అత్యంత ప్రశాంత వాతావరణంలో సాగుతున్నాయని వివరించారు. ఇప్పటికే గోల్కొండ, బల్కంపేట బోనాల జాతరలు ప్రశాంతంగా ముగిశాయని సీపీ సజ్జనార్ వివరించారు. ప్రస్తుతం ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా అమ్మవార్ల బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. భక్తుల భద్రత, రక్షణే ధ్యేయంగా హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖ అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేసిందని వివరించారు. ఈ వేడుకల కోసం దాదాపు 2,500 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ఠమైన బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. నిరంతర నిఘా కోసం ఆలయ పరిసర ప్రాంతాల్లో అత్యాధునిక ఏఐ సాంకేతికత కలిగిన సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు. ఈ ఉత్సవాలు ప్రశాంతంగా పూర్తి అయ్యేలా పోలీసు శాఖకు భక్తులు పూర్తిస్థాయిలో సహకరించాలని సీపీ సజ్జనార్ కోరారు.













Click it and Unblock the Notifications