మాకు ఎలాంటి సంబంధం లేదు: శ్రీ సిటీ పేలుడు ఘటనపై టాబ్లెట్స్ ఇండియా సంస్థ క్లారిటీ..!
తిరుపతి జిల్లా సత్యవేడు మండలం శ్రీ సిటీలోని టిల్ హెల్త్ కేర్ ఫార్మా కంపెనీలో శనివారం ఉదయం బాయిలర్ పేలిన ఘటనలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మరికొంత మందికి గాయాలయ్యాయి. బాయిలర్ పేలుడు ధాటికి పరిశ్రమలో పని చేసే కార్మికుల్లో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
అయితే ఈ ఘటనపై ప్రముఖ ఫార్మా సంస్థ టాబ్లెట్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. తిరుపతి జిల్లా శ్రీసిటీలోని 'టీఐఎల్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్' (TIL Healthcare Private Limited) పరిశ్రమలో ఇటీవల జరిగిన పారిశ్రామిక బాయిలర్ పేలుడు ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని 'టాబ్లెట్స్ (ఇండియా) లిమిటెడ్' (Tablets (India) Limited) యాజమాన్యం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ప్రమాద వార్తలకు సంబంధించి మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ కంపెనీ అధికారికంగా విలేకరుల ప్రకటన విడుదల చేసింది.

రెండు కంపెనీలూ వేర్వేరు... యాజమాన్యం వేరు!
శ్రీసిటీ ప్రమాదంపై చెలరేగిన గందరగోళాన్ని నివారించేందుకు టాబ్లెట్స్ (ఇండియా) లిమిటెడ్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్) సునీల్ కొఠారి కీలక వివరాలు వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో టాబ్లెట్స్ (ఇండియా) లిమిటెడ్‌కు ఎలాంటి తయారీ యూనిట్ లేదా ఫ్యాక్టరీ లేదని పేర్కొన్నారుటాబ్లెట్స్ (ఇండియా) లిమిటెడ్, టీఐఎల్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేవి రెండూ పూర్తి స్వతంత్ర సంస్థలని చెప్పిన సునీల్ కొఠారి.. ఈ రెండు కంపెనీల మధ్య ఎలాంటి ఉమ్మడి యాజమాన్యం గానీ,నిర్వహణ భాగస్వామ్యం గానీ లేదను స్పష్టం చేశారు.
https://t.co/AI1TWA0oP6
— Tablets (India) Ltd (@TabletsIndiaLtd) October 4, 2026
మీడియా, సాధారణ ప్రజలు ఈ రెండు కంపెనీల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించాలని, అనవసరమైన గందరగోళానికి గురికావద్దని విజ్ఞప్తి చేశారు.శ్రీసిటీ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు కంపెనీ యాజమాన్యం తమ సంతాపాన్ని ప్రకటించింది. వాస్తవాలను సరిదిద్దడానికే ఈ స్పష్టతనిస్తున్నట్లు సంస్థ తెలిపింది.












Click it and Unblock the Notifications
