ఉపాధి కోసం గల్ఫ్ బాట: వ్యభిచార కూపంలో మగ్గుతున్న మహిళలు
రాజమండ్రి: ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టిన చాలా మంది తెలుగు మహిళలు.. యజమానులు ఒత్తిడి, భయభ్రాంతులకు గురి చేయడంతో వ్యభిచారకూపంలోకి నెట్టబడుతున్నారు. గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన కొందరు మహిళలను లైసెన్స్ లేని కొందరు ఏజెంట్లు వారికి ఉపాధి చూపిస్తామని దుబాయ్, ఖతార్ లాంటి గల్ఫ్ దేశాలకు పంపిస్తున్నారు.
అక్కడికెళ్లని మహిళలకు ఉపాధి చూపకుండా వారిని వ్యభిచారం కూపంలోకి నెట్టేస్తున్నారు. కాగా, కొందరు బాధిత మహిళలను ప్రభుత్వం చొరవ చూపి ఏపికి తీసుకురావడం జరిగింది. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు లైసెన్స్ లేని ఐదుగురు ఏజెంట్లపై కేసు నమోదు చేసిన పోలీసులు, వారిని అరెస్ట్ చేశారు.
మార్చి 7న నర్సాపురం పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు నమోదవగా, మరో కేసు మొగల్తూరు పోలీస్ స్టేషన్లో నమోదైంది. అరెస్టైన నిందితులు తిమోతి, వి. ప్రభాకర్, రాజ్ కుమార్, సమేష్, సింహాచలంలు ప్రస్తుతం బెయిలుపై విడుదలయ్యారు.

గోదావరి జిల్లాల్లోని మహిళలను గల్ఫ్ దేశాలకు పంపేందుకు నిందిత ఏజెంట్లకు ఎలాంటి అధికారిక లైసెన్స్ లేదని పోలీసులు తెలిపారు. బాధిత మహిళలను ఆ ఏజెంట్లు విజిటింగ్ వీసాపై పంపిస్తున్నారని చెప్పారు. ఇటీవలి కాలంలో గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి సుమారు 40 మంది మహిళలను ఈ ఏజెంట్లు గల్ఫ్ దేశాలకు పంపించినట్లు తెలిపారు.
దుబాయ్ నుంచి నలుగురు మహిళలను కాపాడినట్లు నర్సాపురం డిఎస్పీ సౌమ్యలత తెలిపారు. ఉపాధి కోసం వెళ్లిన మహిళలను అక్కడి వారు బలవంతంగా వ్యభిచారిణులుగా వాడుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వ లైసెన్స్ ఉన్న ఏజెంట్ల ద్వారా మాత్రమే ఉపాధి కోసం బయటి దేశాలకు వెళ్లాలని సూచిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications