రాజన్న దొర ప్రశ్న: ఎరుపెక్కిన బాబు ముఖం, నో రిప్లై
హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుపేదలకు సంక్రాంతి పర్వదినం సందర్భంగా తాము ఇచ్చే వరాల గురించి వివరిస్తున్నప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజన్న దొర వేసిన ప్రశ్నతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ముఖం ఎర్రబారింది. దానికి ఆయన సమాధానం చెప్పకుండా మిన్నకున్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా పేదలకు పామాయిల్, బెల్లం, పప్పు, నెయ్యి వంటి వాటిని ఉచితంగా అందిస్తామని చంద్రబాబు మంగళవారం శాసనసభలో ప్రకటించారు.
ముఖ్యమంత్రి ప్రసంగం ముగిసిన వెంటనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు పి. రాజన్న దొర - క్రిస్ట్మస్ పర్వదినం ఉందని, అటువంటి వరాలు క్రైస్తవులకు ఎందుకు ఇవ్వడం లేదని అన్నారు. ఆ ప్రశ్నతో చంద్రబాబు కాస్తా ఇబ్బంది పడినట్లే ఉన్నారు. అయితే, ఆ ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు.

దక్షిణ భారతదేశంలో సంక్రాంతి ముఖ్యమైన పండుగ అని, సంపన్నులు తప్ప పేదలు పర్వదినాలు నిర్వహించుకోలేకపోతున్నారని, ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలన్నదే తమ ధ్యేయమని, ఉచితంగా కొన్ని సరుకులు ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై అదనంగా 280 కోట్ల రూపాయల భారం పడుతుందని చంద్రబాబు వివరించారు
ప్రతి ఒక్కరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని తాము ఆశిస్తున్నామని, తాము పేదరిక నిర్మూలనకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు చెప్పారు. ప్రతి నిరుపేద కుటుంబానికి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఐదు కిలోల బియ్యం సరఫరా చేస్తామని చంద్రబాబు చెప్పారు. దీనికి అధికార పార్టీ సభ్యుల నుంచి పెద్ద యెత్తున హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి.












Click it and Unblock the Notifications