వివేకా కేసులో మరో సంచలనం..! విచారణ నుంచి తప్పుకున్న హైకోర్టు మరో బెంచ్..!
ఏపీలో ఎన్నికల వేళ సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఆయన కుమార్తె సునీత, పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవికి అక్కడా షాకులు తప్పడం లేదు. కడప కోర్టు ఆదేశాలపై విచారణకు కేటాయించిన ఓ హైకోర్టు బెంచ్ గతంలోనే తప్పుకోగా.. ఇప్పుడు తాజాగా కేటాయించిన రెండో బెంచ్ కూడా ససేమిరా అంది.
వివేకా హత్య కేసుపై సునీత, బీటెక్ రవి, వైఎస్ షర్మిల, చంద్రబాబు, పవన్, పురందేశ్వరి మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైసీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కడప కోర్టు గతంలో ఆంక్షలు విధించింది. ఎన్నికల వేళ ఈ కేసును పదే పదే ప్రస్తావిస్తున్న సునీత, షర్మిలకు దీంతో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అయితే కడప కోర్టు ఆదేశాలపై షర్మిల మౌనంగానే ఉన్నా.. సునీత మాత్రం హైకోర్టును ఆశ్రయించారు. ఆమెతో పాటు బీటెక్ రవి కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు.

అయితే ఈ పిటిషన్ల విచారణ నుంచి గతంలో జస్టిస్ శేషసాయి, జస్టిస్ విజయ్ ల ధర్మాసనం తప్పుకుంది. దీంతో రిజిస్ట్రీ ఈ విషయాన్ని హైకోర్టు సీజేకు నివేదించింది. ఈ నేపథ్యంలో ఛీఫ్ జస్టిస్ .. ఈ పిటిషన్ల విచారణకు జస్టిస్ యు దుర్గాప్రసాదరావు, జస్టిస్ జె సుమతితో కూడిన బెంచ్ కు విచారణ చేయాలని అప్పగించారు. అయితే అనూహ్యంగా ఈ బెంచ్ కూడా విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. తద్వారా ఈ పిటిషన్లపై విచారణ తర్వాత ఇచ్చే ఆదేశాలపై ఎంత ఒత్తిడి ఉందో అర్ధం చేసుకోవచ్చు.
కడప కోర్టు ఆదేశాలపై విచారణ నుంచి హైకోర్టులో వరుసగా రెండు బెంచ్ లు తప్పుకోవడం సంచలనంగా మారింది. దీంతో హైకోర్టు సీజే ఈసారి ఏ బెంచ్ కు ఈ పిటిషన్ల విచారణ అప్పగించబోతున్నారనేది కీలకంగా మారింది. లేక స్వయంగా హైకోర్టు సీజేనే ఈ పిటిషన్లపై విచారణ చేపడతారా అన్నది తేలాల్సి ఉంది. అసలే ఎన్నికల్లో కీలక సమయం కావడంతో హైకోర్టు ప్రస్తుతం ఈ కేసులో ఇచ్చే ఆదేశాల ప్రభావం కచ్చితంగా వాటిపై పడుతుందని భావిస్తున్నారు.
ఇప్పటికే వివేకా హత్య కేసులో పోలీసులు, సీబీఐ, రాజకీయ నేతలు సహా అందరిపైనా తీవ్ర ఒత్తిడి నెలకొంది. మరోవైపు కేసు విచారణ సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణకు మార్చినా నత్తనడకగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో వివేకా కేసుపై మాట్లాడకుండా కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై విచారణ జరిపి తీర్పు ఇవ్వాల్సిన ధర్మాసనం నుంచి వరుసగా ధర్మాసనాలే తప్పుకోవడం సంచలనాలు రేపుతోంది. ఈ నేపథ్యంలో ఛీఫ్ జస్టిస్ ఈ కేసు విచారణను ముచ్చటగా మూడో బెంచ్ కు కేటాయించనున్నారు.












Click it and Unblock the Notifications