నెల్లూరులో వైసీపీకి మరో బిగ్ షాక్-టైం చూసి మరో ఇద్దరు గుడ్ బై..!
ఏపీలో వైసీపీకి గతంలో 10కి 10 సీట్లు అందించిన నెల్లూరు జిల్లాలో ఈసారి ఆ పార్టీ గడ్డు పరిస్ధితుల్ని ఎదుర్కొంటోంది. వైసీపీ అధికారంలో ఉండగానే.. జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిపోయారు. అనంతరం వారి స్ధానాల్లో ప్రత్యామ్నాయ నేతలను దించినా ఎన్నికల్లో మాత్రం ఓటమి తప్పలేదు. దీంతో పాటు జిల్లాలోని మిగిలిన సీట్లోలోనూ వైసీపీ భారీ తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో వైసీపీకి ఇవాళ మరో కీలక నేత గుడ్ బై చెప్పేశారు.
నెల్లూరు నగర మేయర్ గా ఉన్న పొట్లూరి స్రవంతితో పాటు ఆమె భర్త పొట్లూరి జయవర్ధన్ ఇవాళ వైసీపీకి గుడ్ బై చెప్పేసారు. గతంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్గంగా పేరు తెచ్చుకున్న వీరు.. ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరినప్పుడు ఆయనతో పాటు వెళ్లి మళ్లీ తిరిగి సొంత గూటికి వచ్చేశారు. ఇప్పుడు పార్టీ జిల్లాలో దారుణంగా ఓడిపోవడం, టీడీపీ ఏకపక్షంగా విజయాలు సాధించడంతో ఇబ్బందులు తప్పవన్న అంచనాతో పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది.

ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి తాము వైసీపీని వీడుతున్నట్లు పొట్లూరి స్రవంతి, జయవర్ధన్ ప్రకటించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా తనకు కార్పొరేటర్ టికెట్ ను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డీ ఇచ్చారని స్రవంతి తెలిపారు. తర్వాత మేయర్ ను కూడా చేశారన్నారు. మాలాంటి ఎందరో కార్యకర్తలకు రాజకీయ అవకాశాలు కల్పించారని పేర్కొన్నారు. శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడినప్పుుడూ ఆయనతో ఉంటామని చెప్పామన్నారు.
కానీ అప్పట్లో వైసీపీ నేతల ఒత్తిళ్లతో కోటంరెడ్డిని వదిలి ఆ పార్టీలోకి వెళ్ళాల్సి వచ్చిందని స్రవంతి తెలిపారు. శ్రీధర్ రెడ్డిపై విమర్శలు చేయాలని అక్కడి నాయకులు తమపై ఒత్తిడి తెచ్చారని, అయినా శ్రీధర్ రెడ్డిపై ఒక మాట కూడా మాట్లాడలేదని అన్నారు. తమ తప్పులను శ్రీధర్ రెడ్డీ మన్నించి తిరిగి అక్కున చేర్చుకోవాలని వీరు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications