ఎన్టీఆర్‌తో పోటీ పడి నటించిన అక్కినేని చిత్రాలు
హైదరాబాద్: తెలుగు సినీ రంగంలో ఆ తరంలో అక్కినేని నాగేశ్వర రావు, ఎన్టీ రామారావు సమవుజ్జీలుగా పేరు పొందారు. పోటీ పడి నటించారు. అయితే, వారిద్దరు మంచి మిత్రులు కూడా. బ్రదర్ అంటూ ఒకరినొకరు పిలుచుకునేవారు. వీరిద్దరు కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించాయి.
విగ్రహం, అభివ్యక్తి, వాచకాల్లో ఎన్టీ రామారావుది పూర్తిగా మాస్ అపీల్ అని తెలిసి కూడా అక్కినేని నాగేశ్వర రావు ఆయనతో కలిసి నటించడానికి వెనకాడలేదు. వివిధ పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో ఇద్దరు మేటి నటులు కలిసి నటించారు. సాంఘిక చిత్రాలకు వస్తే గుండమ్మ కథ, మిస్సమ్మ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. మిస్సమ్మలో ఎన్టీ రామారావుది సీరియస్ పాత్ర అయితే, అక్కినేనిది హాస్యరస ప్రధానమైన పాత్ర.
మిస్సమ్మ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో అక్కినేని నాగేశ్వర రావు సినిమా పూర్తయ్యే వరకు కడుపుబ్బా నవ్విస్తూనే ఉంటారు. వారిద్దరు గుండమ్మ కథలో కలిసి నటించారు. గుండమ్మకథలో అక్కినేనిది సీరియస్ పాత్ర అయితే, ఎన్టీఆర్‌ది కాస్తా చలాకీ పాత్ర. ఇందులోనూ అక్కినేని ఎన్టీఆర్‌కు ఏ మాత్రం తీసిపోకుండా నటించారు.
చరణదాసి, రేచుక్కు వంటి చిత్రాల్లో కూడా ఇరువురు మేటి నటులు కలిసి నటించారు. భూకైలాస్ చిత్రంలో ఎన్టీఆర్ గంభీరమైన రావణుడిని పాత్రను ధరిస్తే అక్కినేని నారదుడి పాత్రను పోషించి మెప్పించారు. పల్లెటూరి పిల్ల, సంసాతరం వంటి చిత్రాల్లో కూడా వారిద్దరు కలిసి నటించారు. ఇద్దరు కలిసి నటించిన చిత్రాలు ఇంకా ఉన్నాయి.
శ్రీకృష్ణార్జున యుద్ధంలో ఎన్టీఆర్ కృష్ణుడిగా నటిస్తే, అక్కినేని అర్జనుడిగా నటించారు. ఇక, మాయాబజార్ సినిమా గురించి చెప్పనే అక్కరలేదు. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్ర ధరిస్తే అక్కినేని యువరక్తం ఉప్పొంగే అబిమన్యుడిగా నటించి మెప్పించారు. ఈ సినిమాలో మరో మేరునగధీరుడు ఎస్వీ రంగారావు కూడా ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణతో హేమాహేమీలు చిత్రంలో నటించారు. ఆ తర్వాత చిరంజీవితో మెకానిక్ అల్లుడితో నటించారు. చివరి దశలో కూడా నటనకు ప్రాముఖ్యం ఉన్న పాత్రల్లో నటించారు.













Click it and Unblock the Notifications