గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

11గంటల ఉత్కంఠ: బోరుబావి మృత్యుంజయుడు ఎలా బయటపడ్డాడంటే(పిక్చర్స్)

11గంటల నిరంతర ప్రయత్నం ఫలించింది. వినుకొండ మండలం ఉమ్మడివరంలో మంగళవారం సాయంత్రం 4గంటల సమయంలో తండ్రి పొలంలోని బోరుబావిలో పడిన ఏడాదిన్నర బాలుడు అనమలమూడి చంద్రశేఖర్(చందు) మృత్యుంజయుడిగా తిరిగొచ్చాడు.

|
Google Oneindia TeluguNews

గుంటూరు: 11గంటల నిరంతర ప్రయత్నం ఫలించింది. వినుకొండ మండలం ఉమ్మడివరంలో మంగళవారం సాయంత్రం 4గంటల సమయంలో తండ్రి పొలంలోని బోరుబావిలో పడిన ఏడాదిన్నర బాలుడు అనమలమూడి చంద్రశేఖర్(చందు) మృత్యుంజయుడిగా తిరిగొచ్చాడు. దీంతో ఆశలు వదులుకున్న తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. తమ శ్రమ ఫలించడంతో అక్కడున్న అధికారులు, పోలీసులు, స్థానికులు, ఎమ్మెల్యే, ఎస్పీ అందరూ సంతోషం వ్యక్తం చేశారు.

వెంటనే కదిలిన యంత్రాంగం

వెంటనే కదిలిన యంత్రాంగం

ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉమ్మడివరం గ్రామానికి చెందిన మల్లికార్జున్‌, అనూష దంపతుల కుమారుడు చంద్రశేఖర్‌... మంగళవారం సాయంత్రం 4గంటల సమయంలో బోరు బావిలో పడిపోయాడు. 4.30నిమిషాలకు వినుకొండ పోలీసులు, 108 సిబ్బంది అక్కడికి తరలి వచ్చారు. రూరల్‌ ఎస్పీ అప్పలనాయుడు, కలెక్టర్‌ కోన శశిధర్‌ తదితరులూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సరిగ్గా సాయంత్రం 6.45 గంటలకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గోతిలో ఉన్న బాలుడికి నిరంతరం ఆక్సిజన్‌ అందేలా ఏర్పాట్లు చేశారు. బాలుడి కదలికలు కెమెరాలో గమనిస్తూ వచ్చారు.

రంగంలోకి 300 బకెట్‌ ఎక్స్‌కవేటర్‌

రంగంలోకి 300 బకెట్‌ ఎక్స్‌కవేటర్‌

బోరుబావిలో చిన్నారి పడ్డాడనే వార్త వినగానే దాచేపల్లిలోని భూగర్భ గనుల శాఖ ఏడీ బండ్ల జగన్నాథరావు స్పందించారు. సమీపంలోని క్వారీ నుంచి 300 బకెట్‌ ఎక్స్‌కవేటర్‌ను రప్పించారు. రాళ్లను కోసి, మట్టిని తొలిచే జాక్‌ హ్యామర్‌, బూమర్‌, ట్యాంప్యాక్‌ తదితర యంత్ర పరికరాలనూ రప్పించారు. గుళ్లపల్లి, నకరికల్లు, వినుకొండ, సంతమాగులూరులలో క్వారీల నుంచి నిపుణులైన కార్మికులనూ రంగంలోకి దించారు. 300 బకెట్‌ ఎక్స్‌కవేటర్‌కు తవ్వే సామర్థ్యం అధికం. గట్టున నిల్చునే 25 అడుగుల లోతు వరకు తవ్వగలగడం దీని ప్రత్యేకత. మొత్తం ఆపరేషన్‌లో ఇదే కీలకంగా మారింది. మరో మూడు ఎక్స్‌కవేటర్లను కూడా ఈ ప్రక్రియలో ఉపయోగించారు.

పాటలు వినిపిస్తూ...

పాటలు వినిపిస్తూ...

ఇరుకైన బోరు గుంత... చిమ్మ చీకటి! అందులో చిన్నారి! బాలుడు భయపడకుండా చూసేందుకు... ‘మేమున్నాం' అనే భరోసా కల్పించేందుకు ఎస్పీ అప్పలనాయుడు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. సెల్‌ఫోన్‌లో పాటలు పెట్టి దానిని బాలుడి వద్దకు పంపారు. తమ మాటలూ వినిపించారు. మరోవైపు... సహాయ సిబ్బంది బోరుకు సమాంతరంగా శరవేగంగా, జాగ్రత్తగా గోతిని తవ్వుతూ వచ్చారు.

ఉత్కంఠ...

ఉత్కంఠ...

మంగళవారం రాత్రి 10.30 గంటలు! అప్పటికి... బోరుబావిలో బాలుడుపడి ఏడు గంటలు! సహాయ చర్యలు జోరుగా సాగుతున్నాయి. అంతలో... వర్షం మొదలైంది. మధ్యలో రాతినేల అడ్డు తగిలింది. అదే సమయంలో బోరుబావిలోకి ఓ చిన్న రాయి పడింది. దీంతో... కెమెరాకు బాలుడు సరిగా కనిపించలేదు. బాలుడి కదలికలూ నమోదు కాలేదు. దీంతో... జరగరానిదేమైనా జరిగిందా? అనే భయం, ఆందోళన మొదలైంది. కాసేపటికే... చిన్నారి కదలడంతో సిబ్బంది మరింత ఉత్సాహంతో ముందుకు కదిలారు.

వర్షంలోనూ జోరుగా...

వర్షంలోనూ జోరుగా...

రాత్రి 10.30 గంటల నుంచి వర్షం కురుస్తూనే ఉంది. బాలుడు ఉన్న బోరులోకి నీరు పడకుండా... పాలిథిన్‌ కవర్‌ పట్టుకుని నిల్చున్నారు. బాలుడు 15 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించగా... దాని పక్కనే 20 అడుగుల వరకు గొయ్యి తవ్వారు. నిజానికి... రాత్రి 8 గంటలకే దీని తవ్వకం ముగిసింది. మరో పది నిమిషాల్లో బాలుడిని బయటికి తీయొచ్చెని అంతా భావించారు. అయితే... బోరుబావికి సమాంతరంగా తీసిన గుంత బాలుడిని చేరుకునేందుకు డ్రిల్లింగ్‌ చేస్తుండగా... సున్నపురాయి అడ్డుపడింది. దీంతో... ప్రకంపనలు ఎక్కువగా రాని ప్రత్యేక డ్రిల్లింగ్‌ మిషన్‌తో రంధ్రం వేయడం ప్రారంభించారు.

మరోసారి నిరాశ..

మరోసారి నిరాశ..

అర్ధరాత్రి సమయంలో... మరోమారు బాలుడి నుంచి కదలికలు ఆగిపోయాయి. సిబ్బందిలో మళ్లీ నిరాశ. అయినా తమ ప్రయత్నం ఆపలేదు. ఎక్స్‌కవేటర్‌తో తవ్విన గోతికీ... బాలుడున్న ఉన్న బోరుకూ మధ్య దూరం ఒక మీటరు ఉంది. బాలుడు ఉన్న చోటు నుంచి ఐదు అడుగుల కింద అడ్డంగా సొరంగం తవ్వారు. అక్కడి నుంచి మెల్ల మెల్లగా బోరును కింది నుంచి మెల్లగా తొలుస్తూ వచ్చారు.

చిరునవ్వులతో బాలుడు..

చిరునవ్వులతో బాలుడు..

ఆ బాలుడిని బయటికి తీసుకురావడం ఖాయం! అయితే... అది సజీవంగానే కావాలని తల్లిదండ్రులతోపాటు అక్కడున్న వారందరూ కోరుకున్నారు. అప్పటికే రాత్రి 2.39గంటలు.. మట్టిని ఇలా కదిలించగానే... ఉక్క ఉదుటన బాలుడు కిందపడ్డాడు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది పిల్లాడిని ఒడిసి పట్టుకున్నారు. దాదాపు పది గంటలపాటు బోరులో ఉక్కిరి బిక్కిరి అయిన బాలుడు హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. అప్పటిదాకా పడిన కష్టం మరిచి చిరునవ్వులు చిందించాడు. దీంతో సహాయ చర్యల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బంది తమను శ్రమను మరిచి ఆనందంతో ఎగిరి గంతేశారు. స్థానికులు ఈలలు, కేకలతో తమ హర్షం వ్యక్తం చేశారు.

తల్లిదండ్రుల కళ్లలో ఆనందం..

తల్లిదండ్రుల కళ్లలో ఆనందం..

మొదటి బిడ్డ పురిట్లోనే కన్నుమూస్తే ఎక్కడైతే ఖననం చేశారో దాని పక్కనే బోరు బావిలో రెండో బిడ్డ పడ్డాడు. చివరకు ఈ బాలుడు కూడా దక్కడేమోనని ఆశలు వదులుకున్నారు. ఈనేపథ్యంలో ఆ తల్లిదండ్రుల కళ్లల్లో మళ్లీ ఆనందం తొణికిసలాడింది. కన్నీరు మిగులుతుందనుకున్న వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఉమ్మడివరం సంఘటన నేపథ్యంలో అనుమలమూడి మల్లికార్జునరావు, అనూషలకు తొలికాన్పులో మగబిడ్డపుట్టి పురిట్లోనే చనిపోయాడు. వాడిని తన పొలంలో ఖననం చేశారు. తర్వాత దాని పక్కన్నే గత ఏడాది బోరు వేయించి నీళ్లు పడకపోవడంతో వదిలేశారు. రెండో కాన్పులో చంద్రశేఖర్‌ ఆ తర్వాత మరొక పాప పుట్టారు. వదిలేసిన బోరు బావిలో ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మంగళవారం సాయంత్రం పడిపోయాడు. గతంలో ఏనాడు చూడని ఘటనతో తమ బిడ్డ ఇక బతుకుతాడన్న ఆశ వదులుకున్నారు. రెండో బిడ్డ కూడా దక్కడేమోనని కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికులు, అధికార యంత్రాంగం సకాలంలో స్పందించి నిరంతరంగా 11గంటలపాటు శ్రమించడంతో బోరు బావిలో పడ్డ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. చందూను చూడటంతోనాటు తమ ప్రాణాలు తిరిగి వచ్చాయని అతని తల్లిదండ్రులు అంతులేని ఆనందం వ్యక్తం చేశారు.

అంతా తామై పనిచేసిన అధికారులు

అంతా తామై పనిచేసిన అధికారులు

ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు చేరకముందే జిల్లా ఎస్పీ స్వయంగా గుంత తవ్వకాన్ని పర్యవేక్షించారు. ఓర్పుతో నేర్పుగా చిన్నా పెద్ద అన్నస్థాయిని చూడకుండా అందరి సలహాలను స్వీకరించారు. గుంతలోకి దిగి ప్రతి అంశాన్ని సునిశితంగా పరిశీలించి ముందుకు సాగారు. దాదాపు ఆరుగంటల సేపు ఘటనా స్థలంలోనే ఉండి మైక్‌ పట్టుకుని ఆన్ని శాఖల సిబ్బందికి సూచనలు చేస్తూ కనిపించారు. రెస్క్యూ ఆపరేషన్‌ జరుగుతున్న సమయంలో రోడ్డుపై రాకపోకలు నిలిపివేశారు. ఎస్పీతో పాటు ముగ్గురు డీఎస్పీలు ఇద్దరు సీఐలు ఏడుగురు ఎస్సైలు సిబ్బంది ఆయనతో చివరి వరకు పనిచేశారు. అలాగే కలెక్టర్‌ కోన శశిధర్‌ కూడా హోదాను పక్కన పెట్టి అందరితో కలియ తిరుగుతూ ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి అవసరమైన సలహాలు ఇస్తూ బాలుడిని సురక్షితంగా వెలికితీయించగలిగారు.

ఘటన స్థలంలోనే వైద్య బృందం

ఘటన స్థలంలోనే వైద్య బృందం

ఏనుగుపాలెం పీహెచ్‌సీ డాక్టర్‌ సునీల్‌నాయక్‌తో పాటు పట్టణానికి చెందిన చిన్నపిల్లల వైద్యుడు కిషోర్‌రెడ్డిని ప్రత్యేకంగా పిలిపించారు. వినుకొండలో ఉన్న రెండు 108 వాహనాలతో పాటు అత్యవసర పరిస్థితిలో తరలించడానికి వెంటిలేటర్‌ సదుపాయం ఉన్న అంబులెన్స్‌ను నరసరావుపేట నుంచి రప్పించి సిద్ధంగా ఉంచారు. అర్ధరాత్రి తర్వాత సరిగ్గా 2.39 గంటలకు బాలుడును బయటకు తీయగానే వెంటనే ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం గుంటూరు సమగ్ర ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఇన్‌ఛార్జి డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ రమేష్‌ అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

మానవతను చాటుకున్నారు..

మానవతను చాటుకున్నారు..

బాలుడి కోసం సహాయక చర్యలలో ఎవరికి తోచిన సహాయం వారు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఘటన జరిగిన వెంటనే గ్రామ సమీపంలో క్వారింగ్‌ చేస్తున్న యజమాని మధుసూదనరావు తన వద్ద ఉన్న పొక్లెయిన్‌తో పాటు 200లీటర్ల డీజిల్‌ వెంట పంపించాడు. చేపల చెరువుల వద్ద పనిచేస్తున్న ఇంకో పోక్లెయిన్‌ను మరొకరు పంపించారు. చీకటిపడక ముందే సహాయక చర్యలకు ఇబ్బంది కలగకుండా అడిగిన వెంటనే పిట్టంబండకు చెందిన హనుమంతుసింగ్‌ జనరేటర్‌తో పాటు లైటింగ్‌ సౌకర్యం కల్పించారు. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ సమీరాఖానమ్‌ భర్త షమ్మీం తనవంతుగా బండరాయిని పగలకొట్టేందుకు డ్రిల్లింగ్‌మిషన్‌ పంపించారు. గ్రామ మాజీ సర్పంచిలు వెంకట్రావు, వెంకటసుబ్బయ్యతో పాటు గ్రామస్థులు తమవంతుగా అడిగిన వెంటనే పలుగు పారలు తెచ్చి సహాయపడ్డారు. ఇది ఇలా ఉండగా, తెల్లవారితే కొడుకు పెళ్ళి. పెళ్ళి పనులు కూడా పక్కన పెట్టి బోరుబావిలో పడిన చందూను రక్షించే పని పూర్తయ్యే వరకూ గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు ఉన్నారు. బోరుబావి నుండి చంద్రశేఖర్ సురక్షితంగా బయట పడటంతో ఎమ్మెల్యేపై పలువురు ప్రశంసలు కురిపించారు. మొత్తం 400మంది వరకూ బాలుడిని రక్షించే పనిలో పాల్గొన్నారు.

English summary
After being trapped at 15 feet depth in a hundred feet abandoned borewell two year old Guntur boy, Anamaluru Chandra Sekhar (Chandu) was rescued safely on intervening night of Tuesday and Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X