ఏపీలో ఎబోలా అలెర్ట్.. అక్కడ ఎబోలా స్క్రీనింగ్ పరీక్షలు!
ఆఫ్రికా ఖండంలో ఎబోలా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత జాగ్రత్త వహిస్తోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశాలతో విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ప్రయాణికులకు విమానాశ్రయంలో స్క్రీనింగ్
విమానాశ్రయ అధికారులు మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది కలిసి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. మంగళవారం సింగపూర్ నుంచి వచ్చిన విమానంలోని ప్రయాణికులకు ఉదయం నుంచి స్క్రీనింగ్ ప్రక్రియ చేపట్టారు. థర్మల్ స్క్రీనర్ల ద్వారా శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేసి, ఎబోలా లక్షణాలు ఉన్నట్లు అనుమానం వచ్చిన వారిని వెంటనే క్వారంటైన్‌కు తీసుకెళ్లే ఏర్పాట్లు చేశారు.

ఎబోలా వైరస్ లక్షణాలు ఇవే
ఎబోలా వైరస్ చాలా ప్రమాదకరమైనది. ఇది రక్తం, శరీర ద్రవాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. జ్వరం, తీవ్రమైన బలహీనత, వాంతులు, అతిసారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆఫ్రికాలో ఇటీవల కేసులు పెరగడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అన్ని దేశాల వారిని అప్రమత్తం చేసింది. దీన్ని దృష్టిలో ఉంచి భారతదేశం కూడా అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో జాగ్రత్తలు చేపట్టింది.
గన్నవరం విమానాశ్రయంలో ప్రత్యేక ఆరోగ్య బృందాలతో ఎబోలా స్క్రీనింగ్
గన్నవరం విమానాశ్రయంలో ప్రత్యేక ఆరోగ్య బృందాలను ఏర్పాటు చేసి, 24 గంటలూ సేవలు అందిస్తున్నారు. విదేశీ ప్రయాణికులతో పాటు, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారందరినీ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. లక్షణాలు ఉన్నవారిని వెంటనే ఆసుపత్రికి తరలించి, అవసరమైన టెస్టులు చేయనున్నారు. ఏపీ ఆరోగ్య శాఖ అధికారులు ఈ విషయంపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.
ఏపీలో ఎబోలాపై ప్రభుత్వం అలెర్ట్
రాష్ట్రంలో ఎబోలా వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కానీ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ చర్యలు ఏపీలోని ఇతర విమానాశ్రయాల్లో కూడా అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రయాణికులు సహకరించి, ఆరోగ్య సిబ్బంది సూచనలను పాటించాలని విమానాశ్రయ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ అప్రమత్త చర్యలు రాష్ట్రంలో ఆరోగ్య శాఖ పని తీరును, ప్రభుత్వ అప్రమత్తతను చెప్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కోవడానికి ఇవి ఉపయోగపడతాయి.












Click it and Unblock the Notifications