AP Assembly Budget session: టీడీపీ వ్యూహం.. వైసీపీ ప్రతివ్యూహం: నేటినుండి రచ్చే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో నేటి నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలకు కీలకం కానున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించి పొలిటికల్ హీట్ కొనసాగుతున్న క్రమంలో నేటి నుంచి మొదలవుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరింత హీట్ పుట్టించనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవి ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాగా, రేపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టే బడ్జెట్ పైన, అసెంబ్లీ సమావేశాలలో అధికార వైసీపీని ఏ విధంగా ఎండగట్టాలి అన్న అంశం పైన తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా సిద్ధమైంది.

అసెంబ్లీ సమావేశాలను వేగంగా ముగించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంటే, ఈ అసెంబ్లీ సమావేశాలు కనీసం 10 రోజులైనా నిర్వహించాలని టిడిపి డిమాండ్ చేస్తుంది. కేవలం బడ్జెట్ పైన చర్చ మాత్రమే కాకుండా, తాము సభలో ప్రస్తావించవలసిన ప్రత్యేక అంశాలు కూడా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ చెబుతోంది.
వైసిపి పాలనలో ఇప్పటివరకు విఫలమైన అనేక అంశాలను సభా వేదికగా చెప్పాలని టిడిపి భావిస్తుంది. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, పోలవరం, ఏపీలో కొనసాగుతున్న దాడులు, పోలీస్ ల కేసులు, వైసిపి నుండి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి టిడిపి నుండి వైసీపీలోకి జంప్ అయిన వారిని గురించి మౌనంగా ఉండడం వంటి అనేక అంశాలను సభలో లేవనెత్తాలని తెలుగుదేశం పార్టీ అస్త్ర శాస్త్రాలను రెడీ చేసుకుంటుంది.
తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వకుండా సాధ్యమైనంత త్వరగా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ముగించాలని, ఎలాంటి పరిస్థితులనైనా బలంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలని వైసిపి కూడా సిద్ధమైంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ కొన్ని అంశాల పైన పట్టుపడితే గత సమావేశాలలో పూర్తిగా టిడిపి సభ్యులను సస్పెండ్ చేసినట్టుగా ఇప్పుడు కూడా అదే బాటలో నడవాలని వైసిపి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.
ఇక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ సమావేశాలు కావడంతో ఈ సమావేశాలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం. అందుకే అమీ తుమీ తేల్చుకోవటానికి సిద్ధమైన టిడిపి, వైసిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీ వేదికగా ఏపీ రాజకీయాలలో కాక పుట్టించనున్నారు. నేటి నుండి రచ్చ మొదలు పెట్టనున్నారు.












Click it and Unblock the Notifications