AP Assembly: తొలి రోజే లోకేష్ పేల్చనున్న బిగ్ బాంబ్.. జగన్ ఈ సారి కూడా ఆబ్సెంట్!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజుల పాటు సాగే అవకాశం కనిపిస్తున్న ఈ సభా సమరంలో సర్కార్‌ను కార్నర్ చేసేందుకు ప్రతిపక్షం, వైసీపీ దాడిని తిప్పికొట్టేందుకు కూటమి ప్రభుత్వం వ్యూహప్రతివ్యూహాలు సిద్ధమయ్యాయి. మొదటిరోజే సభలో అసలైన రాజకీయం నడవనుంది. నిరుద్యోగులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్న 'మెగా డీఎస్సీ-2025'పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తొలిరోజే సభలో సంచలన ప్రకటన చేయనుండటంతో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికితోడు ఎల్-నినో ప్రభావంపై లఘు చర్చతో సభను మొదటిరోజే రసవత్తరంగా మార్చేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది.

గైర్హాజరైతే 'జీతాలు కట్'.. స్పీకర్ సంచలన అస్త్రం!
సభకు రాకుండా జారుకునే ఎమ్మెల్యేలకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఊహించని షాక్ ఇచ్చారు. ఇకపై సభలో "దొంగ హాజరు"లకు ఆస్కారమే లేదని తేల్చిచెప్పారు. సభ్యులు తమకు కేటాయించిన స్థానాల్లో స్వయంగా కూర్చుంటేనే 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐ-కెమెరాలు' ఆటోమేటిక్‌గా ఆన్ అయి హాజరును రికార్డు చేసేలా డిజిటల్ కెమెరా టెక్నాలజీని తీసుకొచ్చారు. ఇంతటితో ఆగకుండా, ప్రజాధనాన్ని వృథా చేస్తూ సభకు గైర్హాజరయ్యే ప్రజాప్రతినిధుల జీతభత్యాలను వెనక్కి తీసుకునేలా పార్లమెంట్ పరిధిలోనే కఠిన చట్టం తేవాలని కేంద్రానికి లేఖ రాసినట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. ప్రజలు గెలిపించింది సభలో కూర్చుని మాట్లాడటానికేనని, జగన్ బాధ్యతాయుతంగా అసెంబ్లీకి రావాల్సిందేనని తేల్చిచెప్పారు.
గత అక్రమాలపై 'అటాక్'.. నాలుగు రోజుల పొలిటికల్ డ్రామా!
నాలుగు రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం పాత సర్కార్ పాపాలను ఎండగట్టేందుకు పక్కా అజెండాతో వస్తోంది. ఆగస్టు 18న స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ల డెడికేటెడ్ కమిషన్ నివేదికపై చర్చ జరగనుండగా.. మూడో రోజు వైసీపీ హయాంలో జరిగిన 'గ్రూప్-1 నియామకాల స్కామ్'ను బయటపెట్టేందుకు వ్యూహం రచించింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, నాలుగో రోజు పెట్టుబడులతో పాటు సూపర్-6 హామీల అమలుపై సుదీర్ఘంగా చర్చించనుంది. మొత్తం 6 కీలక బిల్లులను సభలో ఆమోదింపజేసుకునేందుకు ప్లాన్ చేసింది.
జగన్ 'బాట' ఎటు?.. మండలిలో వైసీపీ వ్యూహాత్మక 'చెక్'!
స్పీకర్ హెచ్చరికలు ఒకవైపు ఉంటే.. వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి డుమ్మా కొట్టడమే దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మైక్ ఇవ్వని సభకు వెళ్లడం దండగ అన్న భావనలో విపక్షం ఉంది. అయితే, శాసనసభలో బలం లేకపోయినా.. మెజారిటీ ఉన్న శాసనమండలి వేదికగా కూటమి ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని వైసీపీ పక్కా స్కెచ్ వేసింది. మండలిలో వైకాపా సభ్యులు ఒక్కటై శాంతిభద్రతలు, రెవెన్యూ వివాదాలు, సూపర్-6 హామీల ఆలస్యంపై సర్కార్‌ను గట్టిగా నిలదీసేందుకు సమాయత్తమయ్యారు. అసెంబ్లీలో కూటమి దాడి.. మండలిలో వైసీపీ కౌంటర్ అటాక్‌తో రాబోయే నాలుగు రోజులు ఏపీ రాజకీయంలో కాకరేపడం ఖాయంగా కనిపిస్తోంది.


Download











Click it and Unblock the Notifications